Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు..

|

Mar 12, 2024 | 6:23 AM

ఇల్లు కట్టుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. అయినప్పటికీ ఆ కలను సాకారం చేసుకునేందుకు దోహద పడేవి గృహ రుణాలు. వీటిని బ్యాంకులు మంజూరు చేస్తాయి. అయితే వీటిని తీసుకునే సమయంలో ప్రతి ఒక్కరూ కొన్ని అంశాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ అంశాలు ఏంటి? వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి.. లేకుంటే నష్టపోతారు..
Home Loan
Follow us on

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దాని సాకారం చేసుకోవడానికి నిత్యం కష్టపడతారు. రియల్ ఎస్టేట్ నిపుణులు చేసిన సర్వే ప్రకారం దేశంలోని 44 శాతం మంది యువత రాబోయే రెండేళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ శాతం. అయితే ఇల్లు కట్టుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. అయినప్పటికీ ఆ కలను సాకారం చేసుకునేందుకు దోహద పడేవి గృహ రుణాలు. వీటిని బ్యాంకులు మంజూరు చేస్తాయి. అయితే వీటిని తీసుకునే సమయంలో ప్రతి ఒక్కరూ కొన్ని అంశాలను బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ఆ అంశాలు ఏంటి? వాటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

డౌన్ పేమెంట్..

ఎవరైనా గృహ రుణం తీసుకోవాలంటే మొదటిగా కొంత డౌన్ పేమెంట్ చేయాల్సిన అసవరం ఉంటుంది. మనదేశంలో డౌన్ చెల్లింపులు సాధారణంగా ఆస్తి విలువలో 10 నుంచి 20 శాతం వరకూ ఉంటాయి. పెద్ద డౌన్ పేమెంట్‌ను ఎంచుకోవడం వల్ల తక్కువ రుణం లభిస్తుంది. వడ్డీ చెల్లింపులు తగ్గుతాయి. ఇది మీ క్రెడిట్ యోగ్యతను మెరుగుపరుస్తుంది. మీ దరఖాస్తును బలపరుస్తుంది. మీరు మరింత అనుకూలమైన వడ్డీ రేట్లు పొందటానికి వీలుంటుంది. అయితే అధిక డౌన్‌ పేమెంట్‌ను ఎంచుకోవడానికి ఎక్కువ పెట్టుబడి అవసరం. కాబట్టి డౌన్ పేమెంట్ కలిగి ఉండి, అలాగే నెలవారీ వాయిదాలు (ఈఎమ్ఐ)లను మీరు ఇబ్బంది లేకుండా కట్టగలిగే సౌకర్యం ఉండాలి.

పొదుపు సామర్థ్యం..

గృహ రుణం పొందడానికి ముందు మీ పొదుపు సామర్థ్యం కలిగి ఉండడం చాలా ముఖ్యం. అధిక ఆదాయం కలిగి ఉంటే పెద్ద రుణాలకు అర్హత పొందవచ్చు, మీ ఆదాయం, ఇప్పటికే ఉన్న అప్పులను రుణదాతలు ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకుంటారు. రుణం – ఆదాయం నిష్పత్తి (డీటీఐ) ఆధారంగా మీ స్తోమతను అంచనా వేస్తారు. మీ పొదుపు సామర్థ్యం బాగుంటే రుణాలు తొందరగా మంజూరవుతాయి. మీ ఆదాయంలో మూడింట ఒక వంతును ఆదా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అయితే చిన్న స్థిరమైన పొదుపులు కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.

ఇవి కూడా చదవండి

స్థిరమైన ఆదాయం..

మీరు స్థిరమైన ఆదాయం కలిగి ఉండి, ఖర్చుల విషయంలో క్రమశిక్షణతో మెలగాలి. మీకు వచ్చే ఆదాయం, మీ ఖర్చుల వివరాలను రుణదాతలు పరిశీలిస్తారు. సాధారణంగా ఆరు నెలల ఖర్చుల వివరాలు మీ ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తాయి. ఆదాయంలో మూడింట ఒక వంతు ఆదా చేయడం ఉత్తమం. అయితే చిన్న పొదుపులు కూడా భద్రతా వలయాన్ని నిర్మిస్తాయి.

చెల్లింపులు..

గృహ రుణాన్ని చెల్లించడం అనేది ఒక ముఖ్యమైన ఆర్థిక నిబద్ధత. జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా, తెలివిగా నిర్వహించాలి. రుణం కోసం దరఖాస్తు చేసే ముందుగానే ఒక్క విషయం ఆలోచించాలి. రుణం పొందిన తర్వాత మూడు నుంచి ఐదేళ్ల వరకూ నెలవారీ వాయిదాలను కట్టగలరో లేదో ఆలోచించాలి. దానికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేసుకోవాలి. మీ ముఖ్యమైన ఖర్చులకు రాజీ పడకుండా, ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా మీరు వాయిదాలు చెల్లించగలగాలి. అది మీకు సాధ్యమనిపిస్తే వెంటనే గృహ రుణానికి దరఖాస్తు చేసుకోండి.

ఉమ్మడి గృహ రుణం..

ఉద్యోగం చేస్తున్న మీ జీవిత భాగస్వామితో ఉమ్మడి గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మీ ఇద్దరి ఆదాయలు కలవడం వల్ల పెద్ద రుణం పొందడానికి అర్హులు అవుతారు. ఆ డబ్బుతో విశాలమైన ఇల్లు లేదా మంచి ఆస్తిని కొనుగోలు చేయడానికి వీలుంటుంది. రెండు స్థిరమైన ఆదాయాలు ఉండడం వల్ల మీ రుణ దరఖాస్తు తొందరగా పరిష్కరమవుతుంది. మీకు అనుకూలమైన వడ్డీకి రుణం పొందే అవకాశం కూడా కలుగుతుంది.

పన్ను మినహాయింపు..

ఉమ్మడి గృహ రుణం పొందిన భార్యాభర్తలిద్దరూ సెక్షన్ 80సీ (ప్రిన్సిపల్ రీపేమెంట్ కోసం), సెక్షన్ 24 (వడ్డీ చెల్లింపు కోసం) కింద వ్యక్తిగత పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. దీని వల్ల గణనీయమైన పన్ను ఆదా అవుతుంది. అదనపు పన్ను పొదుపులు రుణ ముందస్తు చెల్లింపును వేగవంతం చేయడానికి ఉపయోగపడతాయి. తద్వారా చెల్లించిన మొత్తం వడ్డీ తగ్గుతుంది, లోన్ కాలవ్యవధిని తగ్గిస్తుంది.

క్రెడిట్ స్కోర్..

గృహ రుణాన్ని పొందేందుకు క్రెడిట్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 700 కంటే ఎక్కువగా ఉంటే ఉత్తమ క్రెడిట్ స్కోర్ గా భావిస్తారు. అది మీ రుణ చెల్లింపుల తీరును తెలియజేస్తుంది. రుణదాతలకు మీపై నమ్మకం కలిగిస్తుంది. అలాగే మీరు మెరుగైన వడ్డీ రేట్లు, తక్కువ ప్రాసెసింగ్ ఫీజులు, సౌకర్యవంతమైన రుణ నిబంధనలకు అర్హత పొందేలా చేస్తుంది. 600 కంటే తక్కువగా క్రెడిట్ స్కోర్ ఉంటే మీకు అనుకూలం కాని నిబంధనలకు దారితీయవచ్చు. అధిక వడ్డీ రేట్లు, కఠిన షరతులకు ఉంటాయి. మీ రుణ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..