Telangana Government Key Decision: తెలంగాణ ప్రభుత్వం పలు పాలనాపరమైన సంస్కరణలను చేపట్టింది. ఇందులో భాగంగానే జిల్లాల్లో ఉండే జాయింట్ కలెక్టర్ స్థానాలను రద్దు చేస్తూ.. వారి స్థానంలో అడిషనల్ కలెక్టర్(ఏడీసీ) అనే కొత్త పోస్టులను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న జేసీలనే అడిషనల్ కలెక్టర్లుగా మారుస్తూ వారికి పోస్టింగులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 49 మంది నాన్ కేడర్, కేడర్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారని సమాచారం.
ఈ అడిషనల్ కలెక్టర్లకు స్థానిక సంస్థల పర్యవేక్షణను అదనపు బాధ్యతలుగా అప్పగించారు. అంతేకాక 2017 బ్యాచ్ ఐఏఎస్‌లకే ఈ పోస్టింగులు ఇవ్వడం గమనార్హం. మెరుగైన పాలన కోసం పలు సంస్కరణలను చేయబోతున్నట్లు గతంలోనే సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో పని చేస్తున్న జేసీలకు అడిషనల్ కలెక్టర్లుగా పోస్టింగులు ఇచ్చినట్లు సమాచారం. అటు కొన్ని జిల్లాలకు మరి కొంతమంది కొత్త వారిని అడిషనల్ కలెక్టర్లుగా నియమించనున్నారు. వీరికి రెవిన్యూ శాఖ బాధ్యతలన్నింటిని అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
కాగా, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనాపరమైన మార్పులపై వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే భారీ సంఖ్యలో ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఇక ఒక్కో జిల్లాకు వచ్చి ఒకరు, ఇద్దరు, లేదా ముగ్గురు అడిషనల్ కలెక్టర్లను నియమించారు.