తెలంగాణ శాసనభలో 4 సవరణ బిల్లులకు ఆమోదం
తెలంగాణ శాసనసభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు.
తెలంగాణ శాసనసభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లులపై చర్చించి.. సభ్యుల అనుమానాలను నివృత్తి చేశారు మంత్రులు. అనంతరం ఈ నాలుగు బిల్లులను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు స్పీకర్.
ఇండియన్ స్టాంప్ బిల్లు తెలంగాణ 2020, తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్- 2020ను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. జీహెచ్ఎంసీ సవరణ బిల్లు-2020ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు – 2020ను న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు.
సభలో ఆమోదం పొందిన బిల్లులుః
1. ఇండియన్ స్టాంప్ బిల్లు (తెలంగాణ) 2020ః
- భూముల ప్రాథమిక విలువ నిర్ధరణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేశారు.
2. తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు(కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)- 2020ః
- వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా బదలాయించేందుకు అధికారులకు విచక్షణాధికారాలు రద్దు చేశారు.
- ధరణి ద్వారానే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టాన్ని సవరించారు.
- వ్యవసాయేతర ఆస్తులకు కూడా గుర్తింపు సంఖ్య ఇచ్చేలా చట్టానికి సవరణలు చేశారు.
3. జీహెచ్ఎంసీ సవరణ బిల్లు – 2020ః
- మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సవరణ చేశారు.
- 10 శాతం గ్రీన్ బడ్జెట్‌కు నిధుల కేటాయింపు.
- 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ల మార్పునకు సవరణ.
- నాలుగు రకాల వార్డు వాలంటీర్ల కమిటీల ఏర్పాటుకు సవరణ.
- ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని ఎస్ఈసీని సంప్రదించాలని చట్ట సవరణ.
4. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ బిల్లు – 2020ః
- హైకోర్టు సూచన మేరకు నిందితులకు పూచీకత్తు అంశానికి సంబంధించిన సీఆర్పీసీ చట్టాన్ని సవరించారు.
అయితే, ఇవాళ జరిగిన సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొంత మంది హాజరు కాలేదు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొందేం వీరయ్య, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభకు హాజరు కాలేదు. ఇక బీజేపీ నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా హాజరు కాలేదు. అధికార పర్టీ సహా, ఎంఐఎం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం తెలంగాణ శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.