ఏలూరులో కలవరం సృష్టిస్తున్న వింత వ్యాధిపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏలూరులో జనజీవనం అల్లకల్లోలం కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఐదారు రోజుల్లో ఆరేడు వందల మంది ఆసుపత్రుల పాలు కావడం విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకో రీతిలో రోగుల్లో లక్షణాలు మారిపోవడంపై భయాందోళనలు కలిగిస్తోందని పేర్కొన్నారు. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడం, కారణాలు తెలియకపోవడం ఆందోళనకరంగా ఉందన్నారు. సురక్షిత తాగునీరు పొందడం ప్రజల పౌరహక్కు అని…. తాగునీటిని ప్రజలకు అందించడం ప్రభుత్వ కర్తవ్యమని లేఖలో పేర్కొన్నారు.
నీటిని పొందే హక్కు పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొందని ఆయన గుర్తుచేశారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21కూడా అదే నిర్దేశించిందన్నారు. ఏలూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని తక్షణమే ప్రభుత్వం ప్రకటించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఆస్పత్రుల్లో చేరిన వారితో పాటు వారి కుటుంబసభ్యులను వెంటనే ట్రాక్ చేసి అందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. తక్షణమే నగర, గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి సురక్షితమైన తాగునీటి అందించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పించాలని చంద్రబాబు లేకలో పేర్కొన్నారు.