ఏపీకి మూడు రాజధానులుండే చాన్సుందంటూ అసెంబ్లీలో ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసిన ముఖ్యమంత్రి జగన్.. తెలుగుదేశంపార్టీలో చిచ్చు రేపినట్లే కనిపిస్తోంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజదాని అన్న జగన్ ప్రకటనను మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు స్వాగతించారు. అదే కోవలో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి కొండ్రు మురళి కూడా చంద్రబాబు వైఖరికి భిన్నంగా స్పందించారు. తాజాగా కర్నూలులో హైకోర్టు అన్న జగన్ ప్రకటనను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.ఈ. కృష్ణమూర్తి కూడా స్వాగతించారు.
చంద్రబాబుకు సొంత పార్టీ నేతల నుంచే షాకులు తగులుతున్నాయి. రాజధానిపై జగన్ చేసిన ప్రకటన తుగ్లక్‌ని తలపిస్తోదంటూ చంద్రబాబు వ్యాఖ్యానిస్తే.. దానిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో సొంత పార్టీ నుంచి సహకారం లభించాల్సి వుండగా.. టీడీపీ నేతలు కూడా 3 రాజధానుల కాన్సెప్ట్‌ని స్వాగతించడంతో చంద్రబాబుకు దిక్కుతోచట్లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కర్నూలుకు హైకోర్టు కావాలంటూ విద్యార్థి, ఉద్యోగ, అడ్వకేట్ జెఎసీలు గత కొంత కాలంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ చేసిన ప్రకటనను అక్కడ అందరూ స్వాగతిస్తున్నారు. దాంతో కర్పూలు వాస్తవ్యుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి కే.ఈ.కృష్ణమూర్తి కూడా తమ నగరంలో హైకోర్టు ఏర్పాటును స్వాగతించారు. అదే సమయంలో విజయవాడ కంటే పెద్దది, అన్ని మౌలిక సదుపాయాలున్న విశాఖనగరంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును గంటా శ్రీనివాస్ రావు సమర్థించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా గుర్తించడం అంటే ఉత్తరాంధ్రకు పెద్దపీట వేయడమేనని మాజీ మంత్రి కొండ్రు మురళి వ్యాఖ్యానించారు.
దానికి తోడు 3 రాజధానుల ప్రకటనను కేవలం గుంటూరు, కృష్ణా జిల్లాల టీడీపీ నేతలే బహిరంగంగా వ్యతిరేస్తున్నారు. మిగిలిన జిల్లాలకు చెందిన నేతలు దాదాపు మౌనాన్నే పాటిస్తున్నారు. దాంతో రాజధానిపై ప్రకటన చేసిన జగన్… టీడీపీలో పెద్ద చిచ్చే పెట్టారని పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు సమక్షంలో మొహమాటంతో కొందరు 3 రాజధానుల కాన్సెప్టును వ్యతిరేకిస్తున్నా… ఆయన పరోక్షంలో తమ ప్రాంతానికి ఏదో మంచి జరుగుతందన్న అభిప్రాయంతో చాలా మంది తెలుగుదేశం నేతలున్నారని తెలుస్తోంది. మొత్తానికి అధినేత అభిప్రాయంతో పలువురు సొంత పార్టీ నేతలే విభేదించడంతో రాజధానిపై చంద్రబాబుకు త్వరలో యూ టర్న్ తప్పదని చెప్పుకుంటున్నారు.