TDP leaders demanding Jagan government suspection: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న వైఎస్ జగన్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని తక్షణం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది తెలుగుదేశం నేతల బృందం. ప్రజాస్వామ్యాన్ని విస్మరించి రాచరికం తరహాలో రాజ్యాంగ హక్కులు హరిస్తూ జగన్ అరాచక ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులను రాష్ట్రంలో తిరగనీయకుండా డిక్టేటర్ ప్రభుత్వంగా ప్రవర్తిస్తున్నారని, చివరికి కోర్టులు మందలించినా జగన్‌లో మార్పు రావడం లేదని అన్నారు.
పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసిన టీడీపీ బందం శనివారం మధ్యాహ్నం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ని కలుసుకుంది. విశాఖ ఎయిర్‌పోర్టు ఉదంతాన్ని గవర్నర్‌కు వివరించారు టీడీపీ నేతలు. జగన్ ప్రభుత్వాన్ని తక్షణం బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ని డిమాండ్ చేశారు. గవర్నర్‌ని కలిసిన తర్వాత టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, రాజ్యాంగ హక్కులు హరించే ప్రభుత్వం అధికారంలో ఉందని గవర్నర్‌కు తెలిపినట్లు టీడీపీ నేతలు మీడియాకు తెలిపారు.
విశాఖలో పర్యటనకు ముందుగా చంద్రబాబుకు అనుమతి ఇచ్చిన పోలీసులు ఆ తర్వాత మాట మార్చారని ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు శాంతిభద్రతలు సజావుగా చూడటంలో విఫలమయ్యారని, చంద్రబాబు విశాఖలో అడుగుపెట్టకూడదన్న ఈర్ష్యతో ముఖ్యమంత్రి జగన్ వున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పర్మిషన్ లేకుండా జగన్ విశాఖకు రావడంతో ఆనాడు ఆపామని, ఆనాటి సంఘటన ఏపీ పోలీసులు, వైసీపి మధ్య జరిగిందని అంటున్నారు వారు.
విశాఖలో చంద్రబాబును అడ్డుకున్న ఉదంతంపై టీడీపీ అభిప్రాయంతో ఏకీభవించారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. విశాఖ ప్రజలు ఎవ్వరూ నిరసనలలో పాల్గొనలేదని, రాష్ట్రంలోని రౌడీషీటర్లు, కేడీలు విశాఖకు వచ్చి హల్‌చల్ చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. పలు కేసుల్లో ముద్దాయి అయిన కె.కె.రావు నిరసనలలో పాల్గొన్నాడని, ఎవరికీ అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని గుర్తు చేస్తున్నారు.