తానా ఆధ్వర్యంలో ‘పాఠశాల’..8 దేశాల్లో అడ్మిషన్లు

|

Jul 22, 2020 | 5:58 PM

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన తానా తెలుగు భాషా అభివృద్ధిలో భాగంగా 'పాఠశాల' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే 2020-21 విద్యా సంవత్సరానికి గానూ పాఠశాలలో పిల్లల అడ్మిషన్‍ పక్రియ ప్రారంభించింది. వ్యయ ప్రయాసలకు ఓర్చి తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించాలి అన్న ఆశయంతో కేవలం..

తానా ఆధ్వర్యంలో ‘పాఠశాల’..8 దేశాల్లో అడ్మిషన్లు
Follow us on

అమెరికాలోని తెలుగు వారి పిల్లలకు మన మాతృభాష అయిన తెలుగు నేర్పాలనే సంకల్పంతో ‘పాఠశాల’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా). సులభమైన పద్ధతిలో, సరళమైన బోధనతో తెలుగును నేర్పిస్తూ.. వారితో తెలుగులోనే మాట్లాడిస్తూ.. తెలుగు భాషాపై వారు పట్టుసాధించేలా, వారి భాషా ప్రావీణ్యతను చాటేలా గత 5 సంవత్సరాలుగా ఈ ‘పాఠశాల’ వేదిక అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలోనే తానా వల్డ్‌ కల్చరల్‌ ఫెస్ట్‌లో భాగంగా 8 దేశాలలో పాఠశాలను అధికారికంగా ప్రారంభించారు తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి. అందులో భాగంగానే 2020-21 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్ల ప్రక్రియ, ఆన్‌లైన్‌ క్లాసులకు రిజిస్ట్రేషన్‌ మొదలైనట్లు ప్రకటించారు.

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘమైన తానా తెలుగు భాషా అభివృద్ధిలో భాగంగా ‘పాఠశాల’ను తన విభాగంలో ఒకటిగా చేర్చుకుంది. తానా ద్వారా మరింత మంది చిన్నారులకు తెలుగు భాషను నేర్పించాలని, అందుకోసం వివిధ నగరాల్లో పాఠశాల కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 2020-21 విద్యా సంవత్సరానికి గానూ పాఠశాలలో పిల్లల అడ్మిషన్‍ పక్రియ ప్రారంభించింది. జూలై 19, ఆదివారంనాడు జూమ్‍ యాప్ ద్వారా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి  2020-21 అడ్మిషన్ల పక్రియను ప్రారంభించారు. అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న తానా నాయకులు, పాఠశాల నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి ప్రసంగిస్తూ..ఎంత ఖర్చు అయినా ఎన్ని కష్టాలు ఎదురైనా, వ్యయ ప్రయాసలకు ఓర్చి తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించాలి అన్న ఆశయంతో కేవలం 100 డాలర్ల ఫీజుతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇందులో తానావారికంటే టీచర్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తోందన్నారు. ఏడాదికి 40వారాల పాటు, రోజుకూ 2-3 గంటల చొప్పున శ్రమపడి పిల్లలకు తెలుగు భాషను నేర్పిస్తారని చెప్పారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రస్తుతం (ఆదివారం రోజున) 41 కేంద్రాల్లో తానా పాఠశాలలు ప్రారంభించినట్లు చెప్పారు. దాదాపు 1000మంది విద్యార్థులతో 2020-21 విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందని అన్నారు. అయితే, ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులకు ఆన్ క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్పారు. కరోనా అనంతరం పూర్తిస్థాయిలో పాఠశాలను విస్తరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం తానాకి కూడా కమ్యూనిటీకి చేరువ కావటానికి ఉపయోగపడుతుందని జయ్‍ తాళ్ళూరి పేర్కొన్నారు.