
హైదరాబాద్: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తానని సినీ నటుడు, నూతన ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఛానల్‌లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక అవినీతి అక్రమాల విషయంలో గత ఛైర్మన్ రాఘవేంద్రరావు ఉన్నా విచారణ తప్పదని వ్యాఖ్యానించారు.
వెంకటేశ్వర స్వామికి ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఎక్కడా అవినీతికి తావులేకుండా తాను ఎస్వీబీసీకి సేవలు అందిస్తానని పృథ్వీ స్పష్టం చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తాను ఎస్వీబీసీ కార్యాలయంలోనే ఉంటున్నానని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎస్వీబీసీ కార్యాలయ పర్యవేక్షణ నిమిత్తం తాను వచ్చానని వెల్లడించారు. తిరుపతిలో ఉంటే స్వామి భక్తుడిగా, అమరావతికి వస్తే జగన్‌కి విధేయుడిగా ఉంటానని పృథ్వీ అన్నారు.