బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన సీనియర్ నేత సువెందు అధికారి తన సుదీర్ఘమైన రాజీనామా లేఖలో పార్టీని తీవ్రంగా దుయ్యబట్టారు. టీ ఎం సీ లో తెగులు, చెదలు విపరీతంగా పట్టాయని, ప్రస్తుత పార్టీ ఇన్-చార్జీలు దీన్ని తమ సొంత ఆస్తిగా పరిగణిస్తున్నారని ఆయన అన్నారు. ఎవరినీ ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఆయన.. సీఎం, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకున్న ప్రశాంత్ కిషోర్ ఫై పరోక్షంగా ధ్వజమెత్తారు. కేవలం ఒక వ్యక్తితో పార్టీ ఒక్క రోజులో ఏర్పడలేదని, దీని పటిష్ఠత కోసం ఎంతోమంది కృషి చేశారని పేర్కొన్నారు .కొందరు ఇన్-చార్జీలు దీన్ని తమ సొంత ఆస్తి, జాగీరుగా భావిస్తున్నారన్నారు. ఇది తననెంతో బాధిస్తోందన్నారు. తృణమూల్ కోసం ఎవరు కష్టపడ్డారో వారిని పక్కన పెడుతున్నారని, వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. అసలు గ్రౌండ్ రియాల్టీస్ తెలియనివారు, త్యాగం గురించి ఏ మాత్రం అవగాహన లేనివారు ఇప్పుడు పార్టీని తమ చెప్పు చేతల్లోకి తీసుకున్నారు..ఇతరుల గురించి పట్టించుకోకుండా తమ స్వార్ధాన్ని చూసుకునేవారే పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. నిధులకోసం అంగలారుస్తున్నారు. ఎన్నికలు ముగియగానే వాళ్ళు మటుమాయమై పోతారు అని సువెందు అధికారి తీవ్రంగా విమర్శించారు.
ప్రజలు ఇఛ్చిన తీర్పునకు ద్రోహం చేసిన ఫలితంగానే తను పార్టీని వీడుతున్నానని అధికారి పేర్కొన్నారు. పార్టీ తన సిధ్ధాంతాలను వదిలేసి అధికారమే పరమావధిగా వ్యవహరిస్తోందన్నారు. మమత మేనల్లుడు అభిషేక్ ముఖర్జీని పార్టీలో కి తీసుకోవడంపై ఈయన తీవ్ర అభ్యంతరం ప్రకటించిన విషయం గమనార్హం.