యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణపై యూజీసీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా.. విద్యార్థులను రాష్ట్రాలు ప్రమోట్ చేయలేవని సుప్రీం వెల్లడించింది. సెప్టెంబర్ 30వ తేదీలోగా యూనివర్సిటీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని సుప్రీంలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. యువ సేన నేత ఆదిత్య థాకరే కూడా పిటిషన్ సమర్పించినవారిలో ఉన్నారు. విద్యార్థులు అయిదు సెమిస్టర్లను పూర్తి చేశారని, క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్( CGPI) పద్ధతి ప్రకారం వారి తుది పరీక్షల ఫలితాలను వెల్లడించాలని సుప్రీం పిటిషన్‌లో కోరారు. పరీక్షలు రాయకుండా విద్యార్థులకు డిగ్రీలు ఇవ్వలేమని గతంలో యూజీసీ కోర్టుకు విన్నవించిన విషయం తెలిసిందే. అయితే తాజా ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీలోగా యూనివర్సిటీ అనుబంధం ఉన్న కాలేజీలు అన్నీ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది.