నిర్భయ దోషులకు ఇంకా ఉరిశిక్ష అమలు కాకపోవడం, పిటిషన్ల పేరిట విచారణ ఇప్పటికే కొనసాగుతూనే ఉండడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో.. దోషులకు హైకోర్టులు విధించే మరణశిక్షలపై దాఖలయ్యే పిటిషన్ల మీద విచారణ ఆరు నెలలకు మించరాదని, ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం వీటిని తప్పనిసరిగా విచారిస్తుందని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించింది. హైకోర్టులో దాఖలయ్యే అప్పీళ్లను ఈ 6 నెలలోగా ఈ ధర్మాసనం ముందు విచారణకు లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. నిర్భయ దోషులు తమ ఉరిని జాప్యం చేసేందుకు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ.. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లను పురస్కరించుకుని అత్యున్నత న్యాయస్థానం ఈ గైడ్ లైన్స్ విధించింది. ‘అప్పీలు దాఖలైన వెంటనే దాన్ని రిజిస్ట్రీ సంబంధిత హైకోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆయా కేసుల ఒరిజినల్ రికార్డులను, ఇతర డాక్యుమెంట్లను హైకోర్టు 60 రోజుల్లోగా సుప్రీంకోర్టుకుపంపవలసి ఉంటుంది’ అని న్యాయమూర్తులు సూచించారు. డెత్ పెనాల్టీ అప్పీలును విచారణకు అనుమతించగానే లాయర్లు 30 రోజుల్లోగా అదనపు డాక్యుమెంట్లను సమర్పించాలని కూడా వారు అన్నారు. ఒరిజినల్ రికార్డులు గానీ, డాక్యుమెంట్లు గానీ ఈ లోగా అందకపోతే.. రిజిస్ట్రీ రిపోర్టుతో బాటు కేసును సంబంధిత జడ్జి చాంబర్ లో లిస్ట్ చేయాలని కోర్టు పేర్కొంది. అంటే ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానంమాదిరి ఓపెన్ కోర్టులో కాకుండా జడ్జి రూమ్ లోనే లిస్ట్ చేయవలసిఉంటుందని స్పష్టం చేసింది.