A1 Express Movie: టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న లేటెస్ట్ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. లావణ్యా త్రిపాఠి హీరోయిన్. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టర్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషెక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అమితాసక్తి వ్యక్తమవుతుండగా, తన హాకీ స్కిల్స్‌తో సందీప్ కిషన్ అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నారు. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ చిత్రంలో హిప్ హాప్ తమిళ స్వరాలు కూర్చిన “సింగిల్ కింగులం” సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్టయింది.
ఇండియాలోనే అతిపెద్ద, ఉత్తమ హాకీ స్టేడియం అయిన పంజాబ్‌లోని మొహాలి స్టేడియంలో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ క్లైమాక్స్ సీక్వెన్స్‌లను పూర్తి చేశారు. భారతదేశపు టాప్ హాకీ ఫిలిమ్స్ అయిన ‘చక్ దే ఇండియా’, ‘సూర్మ’ షూటింగ్‌లను జరిపింది ఈ స్టేడియంలోనే కావడం గమనార్హం. ఈ క్లైమాక్స్ సీక్వెన్స్‌లు ఫెంటాస్టిక్‌గా వచ్చాయి. సినిమాకి ఇవి పెద్ద హైలైట్ అవనున్నాయి. ఈ సీక్వెన్స్‌లో నటించడం కోసం గత ఆరు నెలలుగా హాకీలో శిక్షణ తీసుకుంటూ వచ్చారు సందీప్ కిషన్. ఆ ట్రైనింగ్‌కు సంబంధించి ఇటీవల ఆయన షేర్ చేసిన వీడియోలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. చిత్రంలో హాకీ ఆడే సీన్లలో ఒక ప్రొఫెషనల్ హాకీ ప్లేయర్ లాగా ఆయన ఆడటం కనిపిస్తుంది. ఆ పాత్రకు న్యాయం చేయడం కోసం సందీప్ కిషన్ పెట్టిన ఎఫెర్ట్‌కు అభినందించకుండా ఉండలేం.
తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సందీప్ కిషన్ స్పందిస్తూ, “హాకీ ట్రైనింగ్‌లో 6 నెలలు.. క్యారెక్టర్‌లో దాదాపు ఒక ఏడాదిగా ఉండటం.. 14 కిలోల బరువు తగ్గడం.. అఫ్‌కోర్స్ కొవిడ్ భయపెడుతుండగానే ఇప్పటిదాకా నేను చేసిన చిత్రాల్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకం చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ క్లైమాక్స్ ఎట్టకేలకు పూర్తి చేశాం. ఇంకొక్క రోజు షూటింగ్ మిగిలుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది” అని ట్వీట్ చేశారు. చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, త్వరలో థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.