Sugar Price Hike: చక్కెర ధర మరింత ప్రియం.. కిలో రూ.70 వరకు పెరుగుదల.. సామాన్యులపై భారం!
Sugar Price Hike: ఒకవైపు చక్కెర ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన పరిస్థితులు ధరలను ప్రభావితం చేస్తుండగా, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల కూడా సమస్యగా మారుతోంది. దీంతో దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు వెంటనే తగ్గే అవకాశాలు కనిపించడం లేదని అంచనా వేస్తున్నారు..

Sugar Price Hike: చక్కెర ధరలు మరింత ఖరీదవుతున్నాయి. గత కొన్ని నెలలుగా చక్కెర ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మార్కెట్‌లో చక్కెర ధరలు తగ్గడం లేదు. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో చక్కెర కిలో రూ.60 నుంచి రూ.70 వరకు అమ్ముడవుతోంది. దీంతో గృహిణుల బడ్జెట్‌పై అదనపు భారం పడుతోంది.
దేశంలోని వివిధ మహానగరాలు, ప్రధాన నగరాల్లో చక్కెర ధరల పెరుగుదల సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతోంది. కోల్‌కతా ప్రజలు ఈ ధరల పెరుగుదలతో అత్యధికంగా ప్రభావితమవుతున్నారు. అక్కడ చక్కెర ధర కిలోకు రూ.70కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో చక్కెర రూ.64కు అమ్ముడవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, జార్ఖండ్ రాజధాని రాంచీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు నగరాల్లో చక్కెర కిలో రూ.63 పలుకుతోంది. ఈ నగరాలతో పోలిస్తే చెన్నైలో చక్కెర ధర కొంత తక్కువగా ఉంది. అక్కడ కిలో చక్కెర రూ.60కు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో కిలో చక్కెర ధర రూ.62 వరకు ఉంది. అయితే, నగరంలోని ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు. అన్ని చోట్లా ఒకే ధర ఉండదని గమనించాలి.
ఇది కూడా చదవండి: Success Story: పల్లెటూరి నుంచి ప్రపంచస్థాయికి.. ఈ రైతుల అద్భుత విజయం.. 3 కోట్లకుపైగా సబ్‌స్క్రైబర్లతో చరిత్ర సృష్టించిన విలేజ్ కుకింగ్ ఛానెల్!
ఏడాదిలో 30 శాతం పెరిగిన ధరలు
చక్కెర ధరల్లో పెరుగుదల ఒక్కసారిగా చోటుచేసుకున్నది కాదు. గత ఏడాది కాలంగా ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. గణాంకాలను పరిశీలిస్తే, ఏడాది కాలంలో చక్కెర ధరలు సుమారు 30 శాతం పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ధరలు త్వరలోనే అదుపులోకి వస్తాయని ప్రజలు ఆశించినప్పటికీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు. తాజా సమాచారం ప్రకారం, గత నెలలోనే చక్కెర ధరలు 5 శాతం పెరిగాయి. ధరలు నిరంతరం పెరుగుతుండటంతో సామాన్యుల వంటింటి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది.
ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. మార్కెట్‌లో చక్కెర సరఫరాను పెంచి, ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం రెండోసారి 2.5 లక్షల టన్నుల చక్కెర దిగుమతి కోటాను జారీ చేసింది. మార్కెట్‌లో సరుకు కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా, ఈ నెలలోనే కేటాయించిన కోటాలో 90 శాతం చక్కెరను విక్రయించాలని చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, ఈ ఏడాది చక్కెర కర్మాగారాలు కూడా ఉత్పత్తిని వేగవంతం చేశాయి. అయినప్పటికీ, రిటైల్ మార్కెట్‌లో చక్కెర ధరలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
దేశీయంగా చక్కెర ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కూడా ఉంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఈ మార్పులు దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతున్నాయి.
ఒకవైపు చక్కెర ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన పరిస్థితులు ధరలను ప్రభావితం చేస్తుండగా, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల కూడా సమస్యగా మారుతోంది. దీంతో దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు వెంటనే తగ్గే అవకాశాలు కనిపించడం లేదని అంచనా వేస్తున్నారు. ఫలితంగా సామాన్య వినియోగదారులు చౌక ధరలకు చక్కెర లభించే వరకు మరికొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు
ఇది కూడా చదవండి: Gold Loan: కొత్త చిక్కులు తెస్తున్న గోల్డ్ లోన్.. అదేంటో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




