జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం చరిత్రాత్మకమైన సంచలన నిర్ణయం తీసుకున్న సంగతివిదితమే. రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. అనంతరం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ.. రాష్ట్రపతి గెజిట్ విడుదల చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగం ప్రకారం చెల్లుతుందా? న్యాయస్థానాల్లో నిలబడుతుందా? అన్నది పలు సందేహాలకు తావిస్తున్న నేపథ్యంలో ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ ఈ అంశంపై స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగబద్ధంగానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో ఈ అంశాన్ని అధ్యయనం చేసి.. ఈ నిర్ణయం తీసుకుందని, ఇందులో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా లోపాలు కనిపించడం లేదని తెలిపారు.