మాకు మద్దతు ఇవ్వకుంటే ఖతం చేస్తాం.. కశ్మీర్ నేతలకు హిజ్బుల్ హెచ్చరిక

|

Sep 14, 2020 | 4:18 PM

కొంతకాలంగా జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలను టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడుతోంది ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్. తాజాగా జమ్మూ కశ్మీర్ నేతలు.. రాజకీయాలకు దూరం కాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తూదంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ హెచ్చరించింది.

మాకు మద్దతు ఇవ్వకుంటే ఖతం చేస్తాం.. కశ్మీర్ నేతలకు హిజ్బుల్ హెచ్చరిక
Follow us on

గత 40 ఏళ్లుగా పాకిస్థాన్ వ్యూహాత్మకంగా ఉగ్రవాదాన్ని పెంచి, పోషించి, మన దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నది. సువిశాల భారతదేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలన్న లక్ష్యంతో ‘పవిత్ర యుద్ధం’ పేరుతో దేశంలో ఉగ్రవాదుల దాడులను ప్రోత్సహిస్తోంది. భయోత్పాతాన్ని సృష్టించి, భద్రతాదళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టి, వివిధ వర్గాల ప్రజలమధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తోంది. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నంచేసి దేశాన్ని ముక్కలు చేయటమే లక్ష్యంగాసాగుతున్న ఈ యుద్ధానికి కేంద్రం కాశ్మీర్. కాశ్మీర్‌ను ముందు కబళిస్తే, ఆ దారిలోనే మిగిలిన ప్రాంతాలను కూడా కబళించవచ్చునన్న దుష్టపన్నాగంతో కుట్రలు పన్నుతోంది. ఇందుకు కొన్ని ఉగ్రవాద మూకలకు సాయం అందిస్తూ ఆర్థిక, రాజకీయ అస్థిత్వాన్ని దెబ్బతీస్తోంది.

ఇందులో భాగంగానే కొంతకాలంగా జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందిన రాజకీయ నేతలను టార్గెట్ గా చేసుకుని దాడులకు తెగబడుతోంది ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్. తాజాగా జమ్మూ కశ్మీర్ నేతలు.. రాజకీయాలకు దూరం కాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తూదంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ హెచ్చరించింది. ఈ మేరకు వారికి ఓ లేఖ కూడా రాసింది. ఉర్దూలో ఉన్న ఈ లేఖ.. కాంగ్రెస్ ఆ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి రమన్ భల్లాకు చేరినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. దీనిపై హిజ్బుల్ డివిజినల్ కమాండర్ సంతకం ఉందని తెలిపారు. రమన్ సింగ్‌తో పాటూ జమ్ము కశ్మీర్‌‌లోని ప్రాంతీయ జాతీయ పార్టీలకు చెందిన మొత్తం 17 నేతల ప్రస్తావన ఈ లేఖలో ఉన్నట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు.

బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రావిన్స్ స్థాయి అధ్యక్షుడు దేవేందర్ సింగ్ రానా, ఇతర మాజీ మంత్రులు, ఆర్‌ఎస్ఎస్ నాయకులను హిజ్బుల్ తన లేఖ‌ ద్వారా హెచ్చరించింది. మీరందరూ రాజకీయలకు దూరంగా ఉండి తమ పోరాటానికి మద్దతు పలకాలని లేఖలో పేర్కొన్నారు. లేదంటే మీపై డెత్ వారెంట్లు జారీ అవుతాయని, తమ నుంచి మిమ్మల్ని ఎంటువంటి రక్షణా కాపాడలేదంటూ హిజ్బుల్ సంస్థ లేఖ ద్వారా నేతలను హెచ్చరించింది. మేము టార్గెట్ చేసుకున్న వారిని వారి వారి ఇళ్లలోనే కాల్చి చంపుతాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఉగ్రవాద సంస్థపై ఉపా చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే రాజకీయనేతల ఎవరైనా భద్రత కావాలని కోరితే రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని కశ్మీర్ పోలీసులు తెలిపారు.