
శ్రీరామ జన్మభూమి పూజకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తన పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే ఆహ్వానితుల లిస్టును ప్రకటించిన ట్రస్టు సభ్యులు… మరో కీలక విషయాన్ని వెల్లడించారు. అయోధ్యలో నిర్మించనున్న శ్రీరామ ఆలయం కింద టైమ్ క్యాప్సూల్‌ను ఉంచనున్నట్లుగా ప్రకటించారు.
సుమారు 2 వేల అడుగుల లోతులో ఈ టైమ్ క్యాప్సుల్‌ను నిక్షిప్తం చేయనున్నారట. ఇందులో రాముడి వివరాలు, రామజన్మభూమి చరిత్ర, సంబంధిత వివరాలు ఉంటాయని ఆలయ నిర్మాణానికి సారథ్యం వహిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ చెప్పారు.
ఈ టైమ్ క్యాప్సుల్‌ను ఒక రాగిరేకులోపల భద్రపరిచి 2 వేల అడుగుల లోతులో ఉంచుతామని తెలిపారు. ఈ క్యాప్సుల్ తద్వారా భవిష్యత్తులో ఈ స్థలం, దీనిపై నెలకొన్న వివాదం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.