Swamy Meets Rajinikanth : అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే రజినీకాంత్ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని తమిళనాడు లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరకోణం లోప్రముఖ ఆధ్యాత్మిక గురువు నారాయణ దీక్షితులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. తాజాగా తలైవాను ఆయన స్వగృహంలో కలిసి.. స్పటికలింగాన్ని ఇచ్చి ఆశీర్వదించారు.
సూపర్ స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అటు సినీ పరిశ్రమలోనూ, ఇటు అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తమైంది. ఆయన ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడం పై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 బారిన ఎక్కడ తమ అభిమాన హీరో రజనీకాంత్ పడ్డారోనని అభిమానులు ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజానికి రజనీకాంత్ ప్రతి ఏడాది ప్రశాంతత కోసం హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్‌ను సందర్శిస్తారు. అక్కడ ఉన్న తన ఆధ్యాత్మిక గురువు దీవెనలు తీసుకుంటారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో తలైవా ఇంటి వద్దనే ఉంటూ తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత “అన్నాతే సినిమా” షూటింగ్‌లో పాల్గొన్న రజని అనారోగ్యం బారిన పడి చికిత్స పొందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆస్పత్రి నుంచి డిశార్జ్ అవుతూ తలైవా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. “దేవుడిచ్చిన సూచనలను అనుసరించి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని.. వయసు రీత్యా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని” తెలిపారు. ఇక పార్టీ కార్యకలాపాలను నిర్వహించనని ప్రకటించారు. మరోవైపు తమ అభిమాన హీరో రాజకీయాలకు దూరమైనా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అభిమానులు కోరుతున్నారు. రజినీకాంత్ పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని అరకోణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణ దీక్షితులు .. తలైవా దంపతులను కలిసి ఆశీర్వాదం అందించారు.