
కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే దానికి విరుగుడును కనిపెట్టేందుకు వేలాది మంది శాస్త్రవేత్తలు.. వందలాది పరిశోధనాశాలల్లో పగలు రేయి శ్రమిస్తున్నారు. అయితే.. వ్యాక్సిన్ సంగతి పక్కన పెట్టండి తాము రూపొందించిన స్పెషల్ డ్రెస్ వేసుకుంటే చాలు కరోనా దానంతట అదే ఖతమవుతుందంటున్నారు ఓ దుస్తుల తయారీ సంస్థ యాజమానులు.
కరోనా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసినా.. అనేక కొత్త ఉత్పత్తులకు అవకాశాలను కూడా కలిగిస్తోంది. ఒకవైపు కరోనా నిర్మూలనకు వ్యాక్సిన్ల తయారీలో అనేక ఫార్మా కంపెనీలు 24 గంటలూ శ్రమిస్తున్నాయి. మరోవైపు కరోనాను అడ్డుకునే విభిన్నమైన విప్లవాత్మక ఉత్పత్తులు, సాధనాల రూపకల్పనలో దిగ్గజ సంస్థలనుంచి స్టార్టప్ కంపెనీల దాకా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా కారణంగా మొత్తం బిజినెస్ మోడల్లో మార్పు వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
లేటెస్టుగా కరోనా వైరస్ నిర్మూలించే యాంటీ వైరల్ దుస్తులు, వస్త్ర బ్రాండ్లు మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ దుస్తులు అరగంటలోనే కరోనాను అంతమొందిస్తాయని కొందరు వస్త్ర తయారీదారులు ప్రకటించుకుంటుండడం ఆకర్షనీయంగా మారింది. ముంబయి లోని ఓ పేరున్న వస్త్ర తయారీ సంస్థ డోనియర్ ఇండస్ట్రీస్ కరోనా నిర్మూలన బ్రాండ్లను పరిచయం చేసింది. స్విట్జర్లాండ్ టెక్స్‌టైల్ సంస్థ హీక్యూ సహకారంతో, నియో టెక్ బ్రాండ్ క్రింద యాంటీ-వైరల్ ఫాబ్రిక్స్ విడుదల చేసింది. ఈ ఫ్యాబ్రిక్ కేవలం అరగంటలో కరోనా వైరస్ నిర్మూలిస్తుందని డోనియర్ సంస్థ ప్రతినిధులు చెప్పుకుంటున్నారు.
హీక్యూ వైరోబ్లాక్ ఎన్‌పిజె03 టెక్నాలజీ ద్వారా కరోనాకు చరమగీతం పాడొచ్చని డోనియర్ ఇండస్ట్రీస్ సీఎండీ రాజేంద్ర అగర్వాల్ చెబుతున్నారు. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు కూడా తమ వద్ద వున్నాయని ఢంకా బజాయిస్తున్నారాయన. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని పీటర్ డోహెర్టీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫెక్షన్ అండ్ ఇమ్యునిటీ (డోహెర్టీ ఇన్స్టిట్యూట్) ఈ పరీక్షలు నిర్వహించిందనీ, ఇవి కరోనాను 99.99 శాతం నిరోధించినట్టుగా నిర్ధారణ అయ్యిందని అంటున్నారాయన. ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా యాంటీ-వైరల్ ఫాబ్రిక్స్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే కరోనా లాంటి ప్రాణాంతాక వైరస్ నివారణ దుస్తులపై పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ ఉత్పత్తులను అమెరికాలోని మెడికల్ టెక్స్‌టైల్ కంపెనీకి ఎగుమతి చేస్తున్నామనీ, భారతదేశంలోని అనేక రాష్ట్ర పోలీసు విభాగాలకు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు.
ప్రాథమికంగా యాంటీ-వైరల్ డ్రెసెస్ విభాగంలో పాలిస్టర్-విస్కోస్ సూటింగ్, ఊలుతో చేసిన సూటింగ్స్ అందుబాటులో ఉంచినట్టు అగర్వాల్ తెలిపారు. వివిధ పరిశ్రమలు యూనిఫాంలుగా జాకెట్లు, సూట్లు, ప్యాంటు, షర్టుల రూపంలో దీన్ని ఉపయోగించవచ్చన్నారు. ఇది కేవలం పైపూత కాదు కనుక ఎక్కువసేపు ఉంటుందని అగర్వాల్ దీమా వ్యక్తం చేశారు. నిర్దిష్ట రసాయనాన్ని ఫాబ్రిక్ నిర్మాణంలోనే పొందుపరచినందువల్ల తరచూ ఉపయోగించినా, ఉతికినా కూడా దీని ప్రభావం నశించిపోదని అంటున్నారాయన. అయితే ఈ యాంటీ-వైరల్ బట్టల ధరలు 20 శాతం ఎక్కువ. జూన్ నెలలో 1,000 మంది చిల్లర వ్యాపారుల నుంచి ఆర్డర్లు వచ్చాయని అగర్వాల్ పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా దేశవ్యాప్తంగా ఆయా రిటైల్ కౌంటర్లలో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రెండు ఉత్పత్తుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం అమ్మకపు ఆదాయంలో కనీసం 15 శాతం పుంజుకుని రూ .200 కోట్లు ఆర్జించాలని ఆశిస్తున్నాయి.