జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంకటరామ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా పాల్గొన్నారు. తాను కాకుండా తన కుమారుడికి వైపార్టీ జెండా కప్పించారు.
జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే.. రాపాక వరప్రసాదరావు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయినా రాపాక మాత్రం తూర్పు గోదావరి జిల్లా రోజోలు నుంచి గెలిచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గెలిచిన తర్వాత వైసీపీలో చేరుతారా అంటే, ఆ పార్టీలో చేరి 152 నంబర్ కావాలని అనుకోవట్లేదని.. జనసేనలో నంబర్ 1గా ఉంటానని చెప్పారు. కానీ, ఈ మాట తప్పడానికి మాత్రం ఎంతో సమయం తీసుకోలేదు. కొద్ది రోజులకే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు అసెంబ్లీలోనే ప్రకటించి సంచలనం రేపారు.
అప్పటి నుంచి జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా రాపాక వరప్రసాద్ గళం విప్పుతున్నారు. రెండ్రోజుల క్రితం సైతం అసెంబ్లీలో సైతం తాను బతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని రాపాక చెప్పడం మరోసారి చర్చనీయాంశమైంది.
ఈ తరుణంలోనే నిన్న ఏకంగా కుమారుడిని వైసీపీలో చేర్పించి మరోసారి చర్చనీయాంశమయ్యారు. అనుకోని కారణాల వల్ల ఎమ్మెల్యేగా ఉండి, తాను వైసీపీలో చేరకుండా వ్యూహాత్మకంగా కుమారుడిని జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పించారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి..!