జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండో రోజు అమరావతిలో పర్యటించారు. రాజధాని రైతులతో సమావేశమై వారి సమస్యల్ని అడిగితెలుసుకున్నారు. జనసేన కార్యాలయంలో పవన్ సమావేశం నిర్వహిస్తుండగా ఓ పాము కలకలం సృష్టించింది. పామును చూసిన వెంటనే అక్కడికి వచ్చిన రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళకు గురయ్యారు. వెంటనే దాన్ని గుర్తించి చంపేశారు. దీంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. రాజధాని అమరావతిని తరలిస్తారనే వార్తలపై పవన్ రైతులతో సమావేశమై వారికి సంఘీభావం తెలిపారు. రాజధాని ఎక్కడికి వెళ్లిపోదని, ఇక్కడే ఉంటుందన్నారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వ విధానాలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వ విధానాలతోనే వెళితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారంటూ పవన్ వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. తమ భవిష్యత్తు తరాలకోసం రాజధాని నిర్మాణానికి రైతులంతా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని పవన్ చెప్పారు.