కర్ణాటక సింగంగా పేరొందిన బెంగళూరు సౌత్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. అన్నామలై తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కుమారస్వామిని కలిసిన అన్నామలై, తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని సీఎం… ఆయనకు సూచించినప్పటికీ.. ఈ నిర్ణయాన్నివెనక్కు తీసుకోలేనని అన్నామలై స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లుగా తాను ప్రజలకు సేవ చేస్తూ ఉన్నానని.. భవిష్యత్‌లో ఏమి చేయాలన్న దానిపై మూడు, నాలుగు నెలల తరువాత ఓ నిర్ణయానికి వస్తానని వెల్లడించారు. అయితే నిజాయితీ, దైర్య సాహసాలు కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న అన్నామలైకు కర్ణాటకలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఉడిపి, చిక్ మంగళూరు జిల్లాల్లో ఆయన ఎస్పీగా పని చేస్తోన్న వేళ, కొందరు నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్లు ఆయన బదిలీలకు కారణమయ్యాయి. ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి వచ్చేందుకే ఆయన తన పదవికి రాజీనామా చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో బీజేపీలో చేరేందుకు అన్నామలై సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.