నిన్నటి ఘటన చాలా దురదృష్టకరమని, చిరంజీవి గారు పెద్దలు వేదిక మీద ఉండగా అలా జరగడం బాధాకరంగా ఉందని శివాజీ రాజా తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగి ఇంత కాలం అవుతున్నా ఒక్క రూపాయికి కూడా లెక్క తెలియని ప్రెసిడెంట్ దీనిపై ఎలా స్పందిస్తారు.. పెద్దలు అన్న గౌరవం లేకుండా రసాభాస చేశారు.. ఇది పెద్దలని పిలిచి అవమానించడం కాదా అని శివాజీ రాజా తీవ్రంగా మండిపడ్డారు.
మేము ఉన్నప్పుడు మా మీద నిందలు మోపారు, అవన్నీ వట్టి మాటలు అని తేలిన తర్వాత కూడా ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కమిటీ ఉంది కమిటీ తన పని తాను చేస్తుందని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగతంగా ఎవరిని దూషించడం నాకు ఇష్టం లేదు కానీ వ్యక్తిగతంగా ఆత్మ విమర్శ చేసుకోవాలి, రాజశేఖర్ చాలా భావోద్వేగాలు గల వ్యక్తి.. 10 లక్షలు విరాళంగా ‘మా’కు ఇచ్చినా బయటికి చెప్పుకోలేదని శివాజీ రాజా స్పష్టంచేశారు.
ఈ సంవత్సర కాలంలో అధ్యక్షుడు నరేష్ ఎంత ఫండ్ తెచ్చారో చెప్పాలి, శ్రీకాంత్ ఆర్టిస్టులకు అండగా ఎప్పుడు ఉంటారు? దాతలు విరాళాలు ఇవ్వటానికి ముందుకొస్తే వడ్డించిన విస్తరిని కాలితో తన్నారని, ఇలాంటి అధ్యక్షుడు ‘మా’ కు ఉండటం మా దురదృష్టకరమని శివాజీ రాజా పేర్కొన్నారు.