
కులమతాలకు అతీతంగా అందరూ పూజించే కలియుగ దైవం సాయిబాబా. ఆయన పేరు స్మరించిన వెంటనే గుర్తొచ్చేది షిర్డీ. ఎప్పటి నుంచో షిరిడీలో సాయిబాబా ఆలయం ఉంది. దేశవ్యాప్తంగా ఎందరో భక్తులు ఆలయాన్ని ప్రతి ఏటా సందర్శిస్తుంటారు. అయితే ఆయన ఎప్పుడు, ఎక్కడ జన్మించారన్నది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీ. కొంతమంది మాత్రం మహారాష్ట్ర పర్బణి జిల్లాలోని పాథ్రీలో 1854వ సంవత్సరంలో ఓ వేపచెట్టు కింద 16 సంవత్సరాల బాలుడిగా బాబా మొదటిసారి స్థానికులకు కనిపించారని చెప్పుకుంటారు. ఇక అలాగే 1918 అక్టోబర్ 15న బూటీవాడలో సమాధి అయ్యారని కూడా ప్రచారం ఉంది. అంతేకాకుండా బాబా దేవుడా.. లేక మనిషా అన్న భిన్న వాదనలు కూడా వినిపిస్తుంటాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్తగా ఓ వివాదం తెరపైకి వచ్చింది. మహారాష్ట్రలో అధికారం చేపట్టిన శివసేన ప్రభుత్వం సాయిబాబా జన్మస్థలమైన పాథ్రీని అభివృద్ధి చేయడానికి 100 కోట్లు కేటాయించడంతో రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. అక్కడ ఆలయాన్ని నిర్మిస్తే షిర్డీ ప్రాముఖ్యత తగ్గిపోతుందని సంస్థాన్ ట్రస్ట్ వాదిస్తుండగా.. చుట్టు ప్రక్కల గ్రామ సర్పంచులు మాత్రం ఆలయాన్ని మూసివేస్తే సర్కార్ తలొగ్గుతుందని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు షిర్డీ బంద్‌కు పిలుపునిచ్చారు. ఇక ఇవాళ సాయంత్రం స్థానికులతో ఈ వివాదంపై చర్చలు జరిపి తదుపరి కార్యాచరణ గురించి చెబుతామని సంస్థాన్ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు.
ఇకపోతే బాబా జన్మస్థలం పాథ్రీనేనని.. అది నిరూపించడానికి ఆధారాలు కూడా ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే దుర్రాని అబ్దుల్లాఖాన్ స్పష్టం చేశారు. షిర్డీ ‘కర్మభూమి’ అయితే.. పాథ్రీ ‘జన్మభూమి’ అని అన్నారు. దీన్ని అప్పటి గవర్నర్ రామ్‌నాధ్ కోవింద్ కూడా సమ్మతించారన్నారు. ఈ రెండు ప్రదేశాలూ దేనికవే గొప్పవన్నారు.
మరోవైపు సాయిబాబా తన 16వ ఏటా షిర్డీకి వచ్చారని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి షిర్డీలోనే ఉంటూ ప్రజల కష్టాలను తీర్చారని.. ఆ తర్వాత అంతర్ధానం అయ్యారని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఇక 1999లోనే బాబా జన్మస్థలం పాథ్రీలో సాయి జన్మస్థాన్ మందిర్‌ను స్థానిక ప్రజలు నిర్మించడం జరిగింది. అటు షిర్డీలో కూడా ఎప్పటినుంచో ఆలయం ఉంది. నాడు తలెత్తని వివాదం నేడు ఎందుకు తెరపైకి వచ్చిందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాగా, బీజేపీ నేతలు మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఈ వివాదం రాజుకుందని.. ఆలయాన్ని షిర్డీ నుంచి తరలించడానికి యోచిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇటు శివసేన మంత్రులు మాత్రం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే.. ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.