చైనా సైన్యంతో లింకులున్న ఏడు ప్రముఖ కంపెనీలు ఇండియాలో తీవ్రమైన చర్యను ఎదుర్కోవలసి రావచ్ఛు.. అంటే ఇటీవల చైనాకు చెందిన 58 యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం వేటు వేసినట్టే వీటి విషయంలో కూడా తీవ్రమైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చైనా లోని హువే, అలీబాబా, జిండియా స్టీల్స్, జిన్ జింగ్ కేఫీ ఇంటర్నేషనల్, చైనా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ గ్రూప్, టెంసెంట్, సైక్ మోటార్ కార్పొరేషన్ అనే ఈ సంస్థలకు చైనా సైన్యంతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధాలు ఉన్నట్టు భావిస్తున్నారు. వీటిపై గట్టి నిఘా పెట్టినట్టు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో భారత్ లోని తన ఆపరేటర్ల ద్వారా హువే సంస్థకు రూ. 12,800 కోట్ల రెవెన్యూ వచ్చినట్టు సమాచారం. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇంజనీరింగ్ కార్ప్స్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ అయిన రెన్ జెంగ్ ఫీ.. 5 జీకి సంబంధించి పలు దేశాల నుంచి సమస్యలను ఎదుర్కొంటున్నాడు.
అలీబాబా సంస్థ.. ఇండియాలో పే టీఎం, జొమాటో, బిగ్ బాస్కెట్, స్నాప్ డీల్ వంటి పలు స్టార్టప్ లలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇక టెంసెంట్ సంస్థ.. ఓలా క్యాబ్స్ లో 400 మిలియన్ డాలర్లను ,ఫ్లిప్ కార్ట్ లో 700 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఇతర సంస్థలు కూడా పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి.