తారాజువ్వల్లా ఎగసిపడిన ముహురత్ ట్రేడింగ్… భారీ లాభాలను ముటగట్టుకున్న మదుపరులు

|

Nov 14, 2020 | 9:41 PM

దీపావళిని పురస్కరించుకుని గంటపాటు జరిగే మూరత్‌ ట్రేడింగ్‌లో సూచీలు అదరగొట్టాయి. ఆరంభంలో భారీ లాభాల్లోకి వెళ్లినప్పటికీ.. స్వల్పంగా లాభాలను పోగొట్టుకున్నాయి...

తారాజువ్వల్లా ఎగసిపడిన ముహురత్ ట్రేడింగ్... భారీ లాభాలను ముటగట్టుకున్న మదుపరులు
Follow us on

Muhurat Trading Session : ముహురత్ ట్రేడింగ్​లో దేశీయ స్టాక్ మార్కెట్లు తారాజువ్వల్లా ఎగసిపడ్డాయి. దీపావళి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సెషన్​లో రికార్డు స్థాయి గరిష్ఠాలకు చేరాయి. సంవత్‌ 2077కు దేశీయ మార్కెట్లు లాభాలతో స్వాగతం పలికాయి. దీపావళిని పురస్కరించుకుని గంటపాటు జరిగే మూరత్‌ ట్రేడింగ్‌లో సూచీలు అదరగొట్టాయి.

ఆరంభంలో భారీ లాభాల్లోకి వెళ్లినప్పటికీ.. స్వల్పంగా లాభాలను పోగొట్టుకున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమైన ట్రేడింగ్‌లో సూచీలు తొలుత భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 380 పాయింట్ల మేర దూసుకెళ్లింది.

కాసేపటికి మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు కొంతమేర ఆవిరయ్యాయి. సెన్సెక్స్‌ 194.98 పాయింట్ల లాభంతో 43,637.98 వద్ద ముగిసింది. నిఫ్టీ 50.60 పాయింట్ల లాభంతో 12,770.60 వద్ద స్థిరపడింది.

సెంటిమెంట్‌గా భావించే ఈ ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిశాయి. సోమవారం దీపావళి బలిప్రతిపద సందర్భంగా మార్కెట్లకు సెలవు. దీంతో మార్కెట్లు మళ్లీ మంగళవారం తెరుచుకోనున్నాయి.