తుని రైలు దగ్ధం ఘటనపై విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు సరిగా విచారణ చేయలేదన్న న్యాయస్థానం.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్ళపాటు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించింది. ఐదేళ్లలో ఒక్క సాక్షిని మాత్రమే మీరు ప్రవేశపెట్టారని తెలిపింది. ఈ కేసులో పోలీస్ ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో వివరణ ఇవ్వాలని కోరింది. ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై పెట్టిన కేసును అక్రమ కేసుగా పరిగణిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది.
గతంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోకపోవడంతో కాపులు ఉద్యమించారు. 2016లో తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన రైలు రోకో సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహా పలువురు కాపు ఉద్యమ నేతల పిలుపు మేరకు ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టారు.
అనంతరం వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఈ ఘటనపై గతంలో నమోదు చేసిన కేసుల్ని ఎత్తేసింది. కానీ విజయవాడ రైల్వే కోర్టులో మాత్రం ఈ కేసులు అలాగే ఉండటంతో ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర నిందితులకూ గత ఏడాది సమన్లు కూడా జారీ అయ్యాయి. అయితే తాజాగా ఈ ఘటనపై విజవాడ రైల్వే కోర్టు తీర్పు వెల్లడించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.