Rafale Fighter : రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే నెలలో భారత్‌కు రానున్నాయి. వీటి రవాణా, పైలట్లకు శిక్షణ కోసం భారత వాయుసేన ఒక బృందాన్ని ఫ్రాన్స్‌కు పంపింది. ఈ నేపథ్యంలో మరో నాలుగు వారాల్లో రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరవచ్చని సమాచారం.
ఆత్యాధునిక 36 రాఫెల్స్‌ను రూ.59,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు భారత్, ఫ్రాన్స్ మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా తొలి బ్యాచ్‌గా ఐదు రాఫెల్ జెట్స్ జూలై 29న భారత్‌కు తీసుకొచ్చారు. అయితే రాఫెల్స్ రాక కోసం అంబాలా ఎయిర్ బేస్‌లో ‘గోల్డెన్ యారోస్’ పేరుతో కొత్త ఎయిర్ స్క్వాడ్రన్‌ను ఏర్పాటు చేశారు. తొలి బ్యాచ్‌గా వచ్చిన ఐదు రాఫెల్స్‌ను సెప్టెంబర్ 10న అధికారికంగా ఐఏఎఫ్‌లోకి ప్రవేశపెట్టారు.
తూర్పు లఢక్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రాఫెల్స్‌ను కూడా రక్షణ కోసం సరిహద్దులోకి పంపించారు. దీంతో లఢక్ గగనతలంలో విన్యాసాలు నిర్వహిస్తున్న రాఫెల్స్ సరిహద్దులో చైనా సైనిక కార్యకలాపాలపై కన్నేసి ఉంచాయి. ఈ తరుణంలో రాఫెల్స్ రెండో బ్యాచ్ భారత్‌కు చేరనుండటం ప్రాధాన్యత సంతరించుకున్నది. కాగా 2023 నాటికి ఐఏఎఫ్‌లో 36 రాఫెల్స్ ప్రవేశం పూర్తవుతుందని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా ఈ నెల 5న స్పష్టం చేశారు.