పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి, మంచిచెడ్డలు చెప్పాల్సిన మాస్టారే దారితప్పాడు. ఓ పూర్వ విద్యార్థి సర్టిఫికెట్ ఇవ్వాలని కోరగా లంచం డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు చెప్పివ వివరాల ప్రకారం.. పెనుగొండకు చెందిన పూర్వ విద్యార్థి నూలి సూర్యప్రకాశ్ పదో తరగతి సర్టిఫికెట్ పోగొట్టుకున్నాడు. కొత్తదాని కోసం తాను చదువుకున్న పెనుగొండలోని జెడ్‌ఎన్‌వీఆర్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ జోశ్యుల శ్రీనివాస్‌కు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇందుకు ఆయన పది వేలు లంచం కావాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇబ్బందులు తప్పవని కరాఖండీగా చెప్పేశాడు. దీంతో మాస్టారి తిక్క కుదర్చాలని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో గురువారం స్టూడెంట్ సూర్యప్రకాశ్ నుంచి హెచ్‌ఎం పది వేల లంచం తీసుకుంటుండగా సీఐలు కె.శ్రీనివాస్, ఎం.రవీంద్ర రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ వివరించారు.
Also Read : కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి