మనలో చాలా మందికి పెంపుడు జంతువులంటే ప్రాణం. చాలా మంది కుక్క, పిల్లి, మేకల్ని పెంచుకుంటే.. కొందరు తమ ఇళ్లల్లో కోతిని కూడా పెంచుకుంటారు. ఇంకా కొందరు చిలుక, పిచ్చుక, నెమలి, రామచిలుక వంటి పక్షుల్ని కూడా పెంచుకుంటారు. ఇక వాటిని ఎంతో ప్రేమగా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిలా చూసుకుంటారు. అలాంటి పెంపుడు జంతువులు, పక్షులతో తమకున్న అనుబంధానికి సంబంధించిన అనేక వీడియోలు ఇటీవలి సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. అయితే, ఒక మహిళ తన పెంపుడు రామచిలుకకు సంబంధించిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన పెంపుడు చిలుక ఆచూకీ కనిపెట్టి చెప్పిన వారికి భారీ బహుమానం ప్రకటించారు. ఆ చిలుక ఫొటోలతో పోస్టర్లు వేసి ఆచూకీ చెప్పినవారికి రూ.5000 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఊరంతా పోస్టర్లు వేసి, ఆటోకు మైకులు పెట్టి మరీ ఈ విషయం ప్రచారం చేస్తున్నారు. ఈ ఘటన మీరట్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…
మీరట్ పోలీస్ ఇంటెలిజెన్స్ టీమ్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఇన్‌స్పెక్టర్‌కు ఒకరోజు గాయపడిన స్థితిలో ఒక చిలుక కనిపించింది. ఆమె ఆ చిలుకను తనతో పాటు ఇంటికి తీసుకొచ్చింది. తనతో పాటు ఇంట్లోనే ఉంచుకుని వైద్యం చేయించారు.. సుమారు 20 రోజుల తరువాత పూర్తిగా కోలుకున్న ఆ చిలుక ఇంట్లో నుండి ఎగిరిపోయింది. ఇప్పుడు చిలుక ఎక్కడుందో ఆచూకీ తెలియదు. దీంతో చిలుక క్షేమం కోసం ఆ లేడీ ఆఫీసర్ ఎంతగానో ఆందోళనకు గురైంది. చిలుక కోసం అంతా గాలించింది. చివరకు లేడీ ఇన్‌స్పెక్టర్ తన చిలుకను కనిపెట్టి ఇచ్చిన వారికి భారీ రివార్డు ప్రకటించింది. తన చిలుక ఎక్కడైన స్వేచ్ఛగా తిరుగుతుంటే తనకు ఎలాంటి బాధా లేదు.. కానీ, ఎవరైనా చిలుకను బంధించి ఉంచితే మాత్రం తను తట్టుకోలేనని చెప్పింది.
మీరట్ LIUలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్వేతా యాదవ్ మోహన్‌పురా ప్రాంతంలో నివసిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఆమె ఒక గాయపడిన స్థితిలో ఒక చిలుకను చూసింది. దానిని కుక్కలు నోటితో ఎత్తుకెళ్తుండటం శ్వేతా యాదవ్ చూసింది. అప్పటికే చిలుక కాలు విరిగిన స్థితిలో కనిపించింది. ఎలాగోలా కుక్కల దాడి నుంచి శ్వేత ఆ చిలుకను రక్షించి తనతో పాటు ఇంటికి తీసుకొచ్చి డాక్టర్‌కి చూపించింది. చిలుకకు చికిత్స అందించారు. ఆ తర్వాత చిలుక పూర్తిగా ఆరోగ్యంగా మారింది. అంతేకాదు..ఆ చిలుకకు మిష్టు అని పేరు పెట్టింది. చిలుకను కుటుంబ సభ్యుల్లో ఒకరిలా చూసుకుంటుండే వారు. అంతేకాదు.. చిలుకను పంజరంలో పెట్టలేదు. ఎప్పుడూ ఇంట్లోనే తిరుగుతూ ఉండేది. కుటుంబం మొత్తం మిష్టుతో అనుబంధం ఏర్పడింది. తనతో పాటు చిలుకను కూడా బయటకు తీసుకెళ్లేవారని శ్వేత చెప్పింది. ఆగస్ట్ 11 ఉదయం చిలుక ఇంట్లో నుండి అకస్మాత్తుగా అదృశ్యమైంది. శ్వేత చిలుక కోసం వెతికినా చిలుక కనిపించలేదు. దీంతో విష్ణు కోసం ఎంతగానో గాలించిన శ్వేతా యాదవ్.. చిలుకను కనిపెట్టి తిరిగి తీసుకొచ్చిన వారికి రూ.5,000 నగదు బహుమతిని ప్రకటించింది.
అయితే, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది తమ చిలుకతో శ్వేతా యాదవ్ ఇంటికి రావటం మొదలు పెట్టారు. కానీ ఆ చిలుక మహిళా ఇన్‌స్పెక్టర్‌కి చెందినది కాదు. ఇప్పటి వరకు చాలా మంది చిలుకతో తన వద్దకు వచ్చారని, కానీ, అది తన పెంపుడు చిలుక కాదని శ్వేతా యాదవ్ చెప్పారు. తన కుటుంబం చిలుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని లేడీ ఇన్‌స్పెక్టర్ చెప్పారు. ఇల్లంతా విషాద వాతావరణం నెలకొంది. తన చిలుక ఎవరికైనా కనిపిస్తే తనకు అప్పగించాలని కోరింది. ఎవరైనా తన చిలుకలను బంధించినట్లయితే దానిని విడిపించాలని కోరారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..