జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం తిరుమలేశున్ని దర్శించుకున్నారు. పూర్తిగా సంప్రదాయ వస్త్రాల్లో వచ్చిన పవన్ కల్యాణ్… పార్టీ సహచర నేత నాదెండ్ల మనోహర్‌తో శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో ఆయన ఆనంద నిలయంలోకి ప్రవేశించారు. స్వామివారి దర్శనానంతరం ఆయనకు రంగనాయక మండపంలో ఆలయ పురోహితులు ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తిరుమల, తిరుపతిలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
మనం ధర్మాన్ని పరిరక్షిస్తే.. ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందన్న సూక్తిని తాను చిన్నతనంలో నేర్చుకున్నానని, ఆ పాఠాన్ని త్రికరణశుద్ధిగా నేటికి పాటిస్తున్నానని జనసేన అధినేత అన్నారు. మూడు దశాబ్దాల క్రితం తిరుపతిలో యోగాభ్యాసం నేర్చుకున్న జ్ఞాపకాలను పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు పవన్ మీడియాకు తెలిపారు.