
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. అతని మరణంతో అభిమానులు, రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు. ‘అతను మాతో, మా మధ్య లేకపోయినా.. అతని మధురస్మృతులు మాత్రం ఎప్పటికీ మా గుండెల్లోనే భద్రంగా ఉంటాయని చాలామంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా సుశాంత్‌ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
ఇదే కోవలో ఇన్‌స్టాగ్రామ్ కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు గౌరవ నివాళిని అర్పించింది. ఇక నుంచి అతడి ఇన్‌స్టా అకౌంట్ జ్ఞాపకార్ధంగా ఉండనుంది. సుశాంత్ బయోలో ‘రిమెంబర్’ అనే పదాన్ని జోడించిన ఇన్‌స్టాగ్రామ్.. అకౌంట్ ఎప్పటికీ అలాగే ఉంటుందని పేర్కొంది. ఈ అకౌంట్‌లోకి మరో వ్యక్తి ఎవరూ లాగిన్ కాలేరని.. ఎటువంటి సమాచారాన్ని కూడా మార్చడానికి సాధ్యపడదని తెలిపింది. అతడి ఇన్‌స్టా అకౌంట్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలు నెటిజన్లకు కనిపిస్తాయంది. కాగా, సుశాంత్ తన చివరి ఇన్‌స్టా పోస్టును 2020, జూన్ 3వ తేదీన ట్వీట్ చేశాడు. అతడు తన తల్లిని తల్చుకుంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఇక ఇన్‌స్టా ఇలా ఓ చనిపోయిన యాక్టర్ అకౌంట్‌ను మెమోరియల్ పేజిగా మార్చడం ఇదే తొలిసారి.
సుశాంత్ తన కెరీర్‌ను బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రారంభించాడు. ‘పవిత్ర రిష్ట’ మానవ్‌గా టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత 2013లో ‘కైపోచే’ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. అలాగే అతను నటించిన ‘కేదార్‌నాధ్’, ‘చిచ్చోరే’ సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. సుశాంత్ చివరిగా ‘దిల్ బెచారా’ అనే సినిమాలో నటించాడు. అతని అంత్యక్రియలు జూన్ 15న ముంబైలో జరిగాయి.