పసిడి పరుగులకు బ్రేక్.. తగ్గిన బంగారం ధర

పసిడి పరుగులకు ఈ రోజు బ్రేక్ పడింది. గోల్డ్ ధరలు మరోసారి భారీగా దిగివచ్చాయి. పరిస్థితులు కుదుటపడేవరకు దాదాపు 2023 సంవత్సరం వరకు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతామని ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. దీంతోపాటు అమెరికా డాలర్ పుంజుకుంది. కరోనా కేసులు తగ్గి, రికవరీ పెరిగిన సంకేతాలు....

  • Sanjay Kasula
  • Publish Date - 5:50 pm, Thu, 17 September 20
పసిడి పరుగులకు బ్రేక్.. తగ్గిన బంగారం ధర

పసిడి పరుగులకు ఈ రోజు బ్రేక్ పడింది. గోల్డ్ ధరలు మరోసారి భారీగా దిగివచ్చాయి. పరిస్థితులు కుదుటపడేవరకు దాదాపు 2023 సంవత్సరం వరకు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతామని ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. దీంతోపాటు అమెరికా డాలర్ పుంజుకుంది. కరోనా కేసులు తగ్గి, రికవరీ పెరిగిన సంకేతాలు అగ్రరాజ్యం అమెరికాలో కనిపిస్తున్నాయి. వ్యాక్సీన్ ప్రయోగాలు తిరిగి ప్రారంభిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పసిడిపై ఒత్తిడి తగ్గి, ధరలు మరింతగా తగ్గాయి. కోవిడ్ కారణంగా మార్చి నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతున్నవిషయం తెలిసిందే. ఎంసీఎక్స్‌లో రూ.56,200కు పైన, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 2,072కు పైన పలికాయి. వ్యాక్సీన్ రాక నేపథ్యంలో గత నెల రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఈరోజు గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.85 శాతం తగ్గి రూ.51,391కి చేరుకుంది.

సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 1.4 శాతం తగ్గి రూ.67,798కి చేరుకుంది. నిన్న రూ.52వేల సమీపానికి చేరుకున్న పసిడి ఈరోజు రూ.51,400 దిగువకు వచ్చింది. రూ.500కు పైగా తగ్గింది. వెండి కిలో కూడా రూ.1000కి పైగా తగ్గింది. గత రెండు వారాలుగా దేశంలో బంగారం ధరలు స్వల్పంగా హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి. అయితే ఫెడ్ రిజర్వ్ ప్రకటనకు ముందు గత రెండు మూడు నాలుగు రోజులుగా స్వల్పంగా పెరుగుతున్నది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే వేగంగా కోలుకుంటుందని, నిరుద్యోగం తగ్గుతోందని ఫెడ్ రిజర్వ్ ప్రకటించడం బంగారం ధర తగ్గుదలపై ప్రభావం చూపిస్తోంది. ఫెడ్ రిజర్వ్, డాలర్, కరోనా రికవరీ పెరగడం సహా వివిధ కారణాలతో బులియన్ మార్కెట్లో బంగారం ధరకు బ్రేకులు పడ్డాయి.

హైదరాబాద్, విశాఖ,విజయవాడలో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర తగ్గడంతో రూ. రూ.54,000 దిగువకు వచ్చింది. రూ.53,950 పలికింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.49,450 పలికింది. బంగారం ధరలు ఇటీవల స్వల్పంగా పెరుగుదల నమోదు చేసినప్పటికీ, రూ.52వేల వద్దే ఆగిపోతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.