మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా సోషల్ మీడియాలో కూడా తన మార్క్ చూపిస్తున్నాడు చెర్రీ. అతి తక్కువ కాలంలో ట్విట్టర్లో మిలియన్ ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న స్టార్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. కేవలం 233 రోజుల్లో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో రామ్ చరణ్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత వేగంగా మిలియన్ ఫాలోవర్స్‌ను ఏ స్టార్ హీరో సాధించలేదట. చరణ్ ఈ ఏడాది మార్చిలో ట్విట్టర్ ఖాతా ప్రారంభించారు. కాగా తన ట్విట్టర్ ఖాతాలో చెర్రీ మాత్రం తండ్రి చిరంజీవి, బాబాయి పవన్ కల్యాణ్‌లను మాత్రమే ఫాలో అవుతున్నారు.
ప్రస్తుతం చరణ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ మరో హీరో. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. అలాగే చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’లో చెరణ్ గెస్ట్ రోల్లో సందడి చేయబోతున్నారు.
Also Read : స్కూల్ బస్సులు, ఆటోలకు కరోనా నిబంధనలు విధించిన ఏపీ సర్కార్