ప్రపంచానికి ఇదో హెచ్చరిక : రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యలు

|

Sep 10, 2020 | 3:37 PM

ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధ విమానాలు అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిపోయాయి. హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో ఇవాళ ఐఏఎఫ్‌కు రఫేల్‌ యుద్ధ విమానాలను అప్పగించే కార్యక్రమంలో..

ప్రపంచానికి ఇదో హెచ్చరిక : రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యలు
Follow us on

ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధ విమానాలు అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరిపోయాయి. హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో ఇవాళ ఐఏఎఫ్‌కు రఫేల్‌ యుద్ధ విమానాలను అప్పగించే కార్యక్రమంలో ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ప్లొరెన్స్‌ పార్లెతో కలిసి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు జాతీయ భద్రతే తొలి ప్రాధాన్యమన్న రాజ్ నాథ్ యుద్ధాలకు దారి తీసే పరిస్థితులు వస్తే భారత వైమానిక దళం (IAF) కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రఫేల్‌ విమానాల చేరికతో ఐఏఎఫ్ మరింత బలోపేతమైందని..వీటి చేరిక ద్వారా ప్రపంచానికి గట్టి సందేశం ఇచ్చినట్లైందని చెప్పారు. ముఖ్యంగా భారత్‌పై దుస్సాహసం ప్రదర్శించాలనుకునే వారికి ఇది గట్టి సందేశమని ఆయన పరోక్షంగా చైనాకు హెచ్చరికలు చేశారు. రఫేల్‌ యుద్ధ విమానాల రాకతో భారత్‌, ఫ్రాన్స్‌ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. ‘రక్షణ పరంగా భారత్‌కు ఇదొక చరిత్రాత్మక ఘట్టం. దేశీయ రక్షణ రంగ పరిశ్రమను ప్రోత్సహించేలా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్‌ను ఆహ్వానించాం. రక్షణ రంగంలో 74 శాతం ఎఫ్‌డీఐలు అనుమతిస్తున్నాం. ఫ్రాన్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందని భావిస్తున్నాం’ అని రాజ్‌నాథ్ అన్నారు. కొవిడ్-19 సంక్షోభ సమయంలో ఐఏఎఫ్ చేసిన సేవలు వెలకట్టలేనివని రక్షణమంత్రి పేర్కొన్నారు. ఇటీవల వరదల సమయంలో ఐఏఎఫ్ అందించిన సేవలను ఆయన కొనియాడారు.