తమిళులు ఏమైనా సహిస్తారు గానీ తమ ఆత్మగౌరవం జోలికి వస్తే ఉప్పెనగా మారతారు. భాష, సంస్కృతి విషయంలో వారు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ‘ఒకే దేశం-ఒకే భాష’ వ్యాఖ్యలపై దక్షణాదిలో నిరసన జ్వాలలు రగులుకోగా..తమిళనాడు అవి మరింత ఉద్రిక్తంగా సాగుతున్నాయి. హిందీలో ఉన్న సైన్ బోర్డ్స్ ఎక్కడ కనిపించినా..వాటికి తమిళులు నలుపు రంగు పూస్తున్నారు. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు షా ప్రతిపాదనపై మండిపడ్డాయి. పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ విషయంపై స్పందించారు. కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. హిందీ భాష అమలు ఎక్కడైనా సాధ్యమవుతోందేమోగానీ దక్షిణ భారత దేశంలో సాధ్యం కాని పని అని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ తమిళనాడు ప్రజలు, దక్షిణాదిలో హిందీని అంగీకరించరు. దేశమంతటా ఒకే భాష ఉండటం దేశాభివృద్ధికి మంచిదే కావచ్చు. కానీ, మన దేశంలో ఒకే భాష లేదు కదా. ఉత్తర భారతీయులు కూడా ఒకే భాష విధానాన్ని అభినందించరు. కాబట్టి ఒకే భాషను బలవంతంగా రుద్దడం సాధ్యం కాదు’ అని రజనీ అన్నారు.
కాగా ఇదే విషయంపై గతంలో కమల్ హాసన్ కూడా స్పందించారు. . ‘ఏ షా, సామ్రాట్, సుల్తాన్ కూడా దేశ ఐక్యతను దెబ్బతీయలేరు’ అని వ్యాఖ్యానించారు. దీని వల్ల చాలా మంది బాధపడాల్సి ఉంటుందని హెచ్చరించారు. హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే దానిపై భారీ ఉద్యమం జరుగుతుందన్నారు. జల్లికట్టు అనేది కేవలం శాంపిల్ మాత్రమేనని, దానికంటే పెద్ద ఉద్యమం జరుగుతుందని కమల్ హాసన్ వార్నింగ్ ఇచ్చారు. మరో నటుడు ప్రకాశ్ రాజ్ కూడా కేంద్రమంత్రి వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ వాదం పేరుతో ఒకేమతం-ఒకే భాష తెరపైకి తెచ్చారని, తర్వాత ఏంటని తీవ్రంగా స్పందించారు.