
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కంటిన్యూ అవుతూనే ఉంది. రోజు రోజుకీ మాయదారి రోగం బారినపడుతున్నారు. అన్ లాక్ అనంతరం తెరుచుకున్న కార్యాలయాల్లో కరోన వైరస్ వ్యాప్తి చెందుతోంది. తాజాగా సికింద్రాబాద్ రైల్ నిలయంలో కరోనా వైరస్ కలకలం రేపింది. 30 మంది రైల్వే ఉద్యోగులకు ఈ కరోనా మహమ్మారి సోకిందని అధికారులు వెల్లడించారు. దీంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
కాగా, రైల్ నిలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 2,500 మంది సిబ్బందికి ఉన్నతాధికారులు కొవిడ్ టెస్ట్‌లు చేయించారు. వారిలో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో రెండు రోజుల పాటు రైల్ నిలయం కార్యాలయాన్ని మూసివేసి శానిటైజ్ చేయనున్నట్టు రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. తిరిగి బుధవారం రైల్ నిలయంలో కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమవుతాయన్నారు. కరోనా వైరస్ సోకిన వారిలో చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని ఆయన తెలిపారు. కరోనా పాజిటివ్ గా తేలిన సిబ్బందిని హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించామని, అత్యవసరమైన వారిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నాని సీపీఆర్వో తెలిపారు.