ఇద్దరు యువతులకు విముక్తి కలిగించిన రాచకొండ పోలీసులు

రాచకొండ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ టీం అంతర్రాష్ట్ర ఆన్‌లైన్ మానవ అక్రమ రవాణాను ఛేదించింది. ఇద్దరు మహిళలను రక్షించిన పోలీసులు నిర్వాహకుడొకరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇద్దరు యువతులకు విముక్తి కలిగించిన రాచకొండ పోలీసులు

Updated on: Jul 21, 2020 | 10:35 PM

మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న రాకెట్ గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. రాచకొండ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ టీం అంతర్రాష్ట్ర ఆన్‌లైన్ మానవ అక్రమ రవాణాను ఛేదించింది. సోమవారం రాత్రి నేరెడ్‌మెట్ వద్ద ఇద్దరు మహిళలను రక్షించిన పోలీసులు నిర్వాహకుడొకరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతానికి చెందిన చిన్న, శివ కుమార్ పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలోని యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశజూపి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొనుగోలు చేసి తీసుకొస్తారు. హైదరాబాద్‌ వచ్చిన అనంతరం వారిచేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇందుకోసం నగరంలోని వివిధ కాలనీల్లో గదులు అద్దెకు తీసుకుని దందా కొనసాగిస్తున్నట్లు పోలీసుల దాడుల్లో వెల్లడైంది. మహిళల ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేసి ఆన్‌లైన్‌లోనే వ్యాపారం జరుపుతున్నారు. పక్కా సమచారంతో దాడి జరిపిన రాచకొండ స్పెషల్ టీం ఇద్దరు మహిళలను విముక్తి కలిగించి నిర్వహకుడిని అరెస్ట్ చేశామని రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ చెప్పారు. కాగా.. ప్రధాన నిర్వాహకుడు చిన్నా పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టామని కమిషనర్ తెలిపారు.