నాటు పడవ బోల్తా .. ఒకరు మృతి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రాణహిత నదిలో విషాదం. కోయపెల్లి రేవు వద్ద నాటుపడవ మునిగి ఒకరు మృతి.

నాటు పడవ బోల్తా .. ఒకరు మృతి

Updated on: Jun 01, 2020 | 8:24 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రాణహిత నదిలో విషాదం చోటుచేసుకుంది. చింతలమానేపల్లి మండలం కోయపెల్లి రేవు వద్ద నాటుపడవ మునిగి ఒకరు మృత్యువాత పడ్డారు. బెజ్జూర్‌ మండలం తలాయి గ్రామానికి చెందిన రంగుబాయి (55) మూడు రోజుల క్రితం గూడెంలో ఉంటున్న తన బిడ్డ ఇంటికి వచ్చింది. కడపునొప్పితో బాధపడుతున్న రంగుబాయి.. ఆయుర్వేద వైద్యం చేయించుకునేందుకు తన అల్లుడు, కూతురు, మరో బంధువుతో కలిసి సోమవారం ఉదయం నాటుపడవలో మహారాష్ట్రలోని వెంకటాపూర్‌కు బయలుదేరారు. కొంత దూరం వెళ్లగానే నాటు పడవ బోల్తాపడింది. అల్లుడు, బిడ్డ, మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరగా, రంగుబాయి నీటిలో కొట్టుకుపోయి మృతి చెందింది. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్‌(టి) ఆస్పత్రికి తరలించారు. రంగుబాయికి గతంలో కూడా కడుపునొప్పి రావడంతో వెంకటాపూర్‌లో చికిత్స చేయించుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us