ప్రకాశం జిల్లా మత్స్యకారులు గ్రూపులుగా విడిపోయి సముద్రంలో రచ్చ రచ్చ చేశారు. నడిసంద్రంలో బోట్ లు వేసుకుని పోటాపోటీ ఛేజింగులు చేసుకున్నారు. వీరి గొడవకు కారణం చేపల వేటకు వాడే వల. చీరాల మండలం వాడరేవుకు చెందిన మత్స్యకారులు చేపల వేట కోసం బల్ల-వలను వాడుతున్నారు. ఆ వలతో మత్స్యసంపద నశిస్తోందని.. చిన్న చిన్న చేప పిల్లలు, చేప గుడ్లు సైతం నాశనం అవుతున్నాయనేది కఠారిపాలెం గ్రామ మత్స్యకారుల అభ్యంతరం. చుట్టు పక్కల 77 గ్రామాలతో జట్టు కట్టి.. వాడరేవు వలలపై తిరుగుబాటు చేశారు. చేపల వేటకు బల్ల-వల వాడకూడదని పట్టుబట్టారు. అయితే.. వీరి వార్నింగ్‌ను పట్టించుకోకుండా.. వాడరేవుకు చెందిన ఓ మత్స్యకారుడు బల్ల-వలతో చేపల వేట చేస్తుండగా.. అతడి బోట్‌ను సముద్రంలో ఛేజ్ చేశారు. ఆ పడవను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి.. వాడరేవు మత్స్యకారులు కఠారిపాలెం గ్రామస్తులపై తిరుగుబాటు చేశారు. ఈసారి సముద్రంలో కఠారిపాలెం బోట్లను వేంటాడి.. వారి బోట్లను బలవంతంగా తీసుకెళ్లారు.
పరస్పర దాడులతో విషయం మత్స్యశాఖ అధికారులకు, పోలీసుల దగ్గరికి చేరింది. ఇరు వర్గాల మత్స్యకారులను పిలిపించి మీటింగ్ పెడితే అక్కడా మళ్లీ గొడవ షురూ అయింది. ప్రభుత్వ నిబంధనల మేరకే బల్ల-వలలను వాడుతున్నామనేది వాడరేవు మత్స్యకారుల మాట. ఈ విషయంలో తమ తప్పేమీ లేదంటున్నారు. అటు.. మీటింగ్ అయితే పెట్టారు కానీ, అధికారులూ ఎటూ తేల్చ లేదు. ఇరు వర్గాల వాదనలు విన్నామని.. నిబంధనల మేరకు నడుచుకుంటామని చెబుతున్నారు మత్స్యశాఖ అధికారులు. బల్ల-వల విషయంలో రూల్స్ ఏం చెబుతున్నాయో పరిశీలిస్తున్నారు.