
ఏపీలో కరోనా వైరస్ తీవ్రత అధికంగానే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.. బుధవారం కొత్తగా 657 మందికి కరోనా సోకింది. మొత్తం కేసులు సంఖ్య 15 వేలు దాటడం గమనార్హం. ఇక రెడ్, కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. వ్యాధి వ్యాప్తి పెరిగిపోతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. డేంజర్ జోన్లుగా భావిస్తోన్న చోట్ల కఠినమైన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో జులై 31వ తేదీ వరకు కంటైన్మెంట్ ఏరియాల్లో లాక్‌డౌన్‌ను పొడిగించారు. జిల్లాలో అనూహ్యంగా కోవిడ్-19 కేసులు పెరగడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇక ఒంగోలు, చీరాల, మార్కాపురంలో కూడా లాక్‌డౌన్ కొనసాగుతోంది.
సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన అన్ లాక్- 2 ప్రక్రియలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ఏరియాల్లో రూల్స్ మేరకు కార్యకలాపాలు సాగుతాయని వెల్లడించారు.