Political News: ఏపీలో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. మొన్నటి వరకు అధికార వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీగా వున్న వాదులాట ఇపుడు వైసీపీ వర్సెస్ జనసేన పార్టీగా మారిపోయింది. కాదేదీ కవితకు అనర్హం అనే దానికి బదులుగా కావేవీ విమర్శలకు అనర్హం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది. చివరికి చెప్పులు కూడా నేతల మధ్య మాటల తూటాలకు అస్త్రంగా మారిపోవడంపై ప్రజల్లో రకరకాల కామెంట్లకు దారి తీసింది. అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ వేదిక మీద చెప్పు చూపిస్తూ మాట్లాడిన వైనానికి రిటాలియేషన్ అన్నట్లుగా ఏపీ మాజీ మంత్రి పేర్నినాని రెండు చెప్పులు చూపిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలకు దిగడంతో పాదరక్షల పర్వం మొదలైంది. పేర్ని నాని రెండు చెప్పులు చూపిస్తూ చేసిన కామెంట్లపై పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. వారాహి యాత్రలో వున్న పవన్ కల్యాణ్.. అధికార పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తూ.. తన చెప్పులు పోయాయని కామెంట్ చేశారు. ఇది పరోక్షంగా పేర్నినానిని ఉద్దేశించే అన్నది జగమెరిగిన సత్యం. దాంతో మంత్రులు రోజా అంబటి రాంబాబు తదితరులు కూడా పాదరక్షల పంచాయితీలో తలో మాట కలిపారు. ఇలా వారాహియాత్ర రక్తి కడుతూ ముందుకు సాగుతోంది. తాజాగా ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని మొత్తం 34 అసెంబ్లీ సీట్లను తామే గెలుచుకోవాలంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య పొలిటికల్ చర్చకు దారితీస్తోంది. ఓవైపు బీజేపీతో కలిసి పయనిస్తూ.. అన్ని కుదిరితే తెలుగుదేశం పార్టీతో జత కట్టేందుకు సిద్దంగా వున్న పవన్ కల్యాణ్ రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో వున్న మొత్తం సీట్లను దక్కించుకుంటామనడం వెనుక వ్యూహాన్ని తరచి చూసేందుకు విశ్లేషకులు ప్రయత్నిస్తున్నారు. పొత్తు కుదిరితే సీట్ల చర్చల్లో పైచేయిగా వుండేందుకే పవన్ ఈవ్యాఖ్యలు చేసి వుంటారని పలువురు భావిస్తున్నారు. అంటే బెస్ట్ బార్గెయినర్ అవతారాన్ని ఎత్తేందుకు పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నారన్నమాట.
పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభించి అయిదు రోజులు (జూన్ 18నాటికి) అవుతోంది. జనసేనకు భారతీయ జనతా పార్టీ మిత్ర పక్షం. కానీ ఈ యాత్రకు సంఘీభావం తెలియజేయడంగానీ, పవన్ యాత్రలో ఎక్కడైనా కమలం పార్టీ నేతలు పాల్గొనడం గానీ జరగలేదు. కనీసం కింది స్థాయి బీజేపీ శ్రేణులు సైతం పవన్ యాత్రలో కనిపించడం లేదు. పోనీ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో మొదలైన పవన్ వర్సెస్ వైసీపీ నేతల పంచాయితీపై కూడా కమలనాథులు ప్రేక్షకులుగానే మిగిలిపోయారు. అటు త్వరలో పవన్ కల్యాణ్‌తో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్న చంద్రబాబునాయుడు కూడా వారాహియాత్రకు సంఘీభావం ప్రకటించలేదు. కనీసం మాటల మంటల్లో తానో నిప్పును జత చేయలేదు. బీజేపీ, టీడీపీలు పవన్ యాత్రపై గుంభనంగా వ్యవహరించడంపై ఏపీలో బాగానే చర్చ జరుగుతోంది. టీడీపీ సంఘీభావం తెలుపకపోయినా ఒకే గానీ.. బీజేపీ నేతలెందుకు పవన్ యాత్రకు దూరంగా వున్నారన్నది ఆసక్తి రేపుతోంది. ఆయన పిలవాలని కమలనాథులు ఆశిస్తున్నారా లేక తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారా అన్నది చర్చనీయాంశమైంది. జూన్ 12,13 తేదీలలో ఏపీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వంపై కాస్త ఘాటుగానే విమర్శలు గుప్పించారు. అవినీతిమయం జగన్ ప్రభుత్వమంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఓ రెండూ, మూడు రోజులపాటు బీజేపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం నడించింది. కానీ ఎపుడైతే పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర మొదలైందో అప్పట్నించి ఏపీ రాజకీయం వైసీపీ, జనసేన మధ్యనే కేంద్రీకృతమైంది.
రాజకీయాల్లో ముందుగా ఎవరు స్నేహహస్తమందిచారన్నది శాశ్వతంగా చర్చనీయాంశం కాకపోయినా రాజకీయ పొత్తులకు ఎవరు చొరవ చూపారన్నది మాత్రం తాత్కాలిక డిబేట్లకు ప్రాధాన్యతాంశమే. ఈక్రమంలో బీజేపీ అధినాయత్వం దగ్గరికి స్వయంగా వెళ్ళిన చంద్రబాబు ఏపీలో మూడు పార్టీల కూటమి ఏర్పాడాలని బలంగా కోరుకుంటున్నట్లు అవగతమవుతోంది. అంతకుముందే ఈ మూడు పార్టీల కలయికను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఈక్రమంలో మూడు పార్టీల అలయెన్స్‌కు టీడీపీ, జనసేన రెడీగా వున్నాయి. కానీ ఏపీ బీజేపీ నేతలే ఇంకా ఎటూ తేల్చడం లేదు. ఇపుడు తేల్చేస్తే రేపు సీట్ల సర్దుబాటులో గట్టిగా వ్యవహరించే అవకాశం వుండదన్న భయం కమలనాథుల్లో వుండివుండవచ్చు. ఏది ఏమైనా పొత్తుల సంగతి తేల్చేది బీజేపీ ఢిల్లీ నాయకత్వమే. వారికి ఎమ్మెల్యేల సీట్ల కంటే ఎంపీ సీట్లే కీలకం. కాబట్టి ఆకోణంలో ఆలోచించే టీడీపీ, జనసేనలతో కలవాలా లేక గెలిచినా ఓడినా సింగిల్‌గానే ఎన్నికలకు వెళ్ళాలా అన్నది బీజేపీ హైకమాండ్ తేలుస్తుంది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన అంశం చెప్పుకోవాలి. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఒకటి, రెండు చోట్ల మాత్రమే పోటీ ఇవ్వగలదు. అది కూడా మోదీ చరిష్మా వల్లనే. ఈక్రమంలో ఏపీలో పొత్తుల సంగతి తేల్చడంలో బీజేపీ రెండంశాలను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ వుంది. ఒకటి.. టీడీపీ, జనసేనలతో కలిస్తే కనీసం 20 సీట్లు (మూడు పార్టీలు కలిపి) వచ్చే ఛాన్స్ వుంటే పొత్తుకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. అలాంటి పరిస్థితి లేదని తెలిస్తే ఒంటరిగా వెళ్ళేందుకే బీజేపీ హైకమాండ్ మొగ్గుచూపవచ్చు. ఎందుకంటే ఎన్నికల తర్వాత అవసరం అయితే బయట్నించి మద్దతిచ్చే పార్టీల్లో వైసీపీ తమకు అండగా వుంటుందన్న అంఛనాలు బీజేపీ శ్రేణుల్లో వున్నాయి. ఈ రెండంశాలను పరిగణలోకి తీసుకునే బీజేపీ ఏపీలో పొత్తు అంశాన్ని తేలుస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.