పూల మొక్కలు.. విద్యుత్ కాంతులు… ఇదేదో రాజప్రసాదం కాదు.. కేరళలోని బేకాల్‌ పోలీసుస్టేషన్..

|

Nov 20, 2020 | 6:08 PM

పోలీసు స్టేషన్.. ఆ పేరు వింటేనే జనం భయంతో వణికిపోతారు. అక్కడి పరిస్థితులు, పోలీసుల భాష చూస్తే.. జీవితంలో ఎప్పుడూ పోలీసుస్టేషన్‌లో అడుగుపెట్టకూడదు అని చాలా మంది అనుకుంటుంటారు.

పూల మొక్కలు.. విద్యుత్ కాంతులు... ఇదేదో రాజప్రసాదం కాదు..  కేరళలోని బేకాల్‌ పోలీసుస్టేషన్..
Follow us on

పోలీసు స్టేషన్.. ఆ పేరు వింటేనే జనం భయంతో వణికిపోతారు. అక్కడి పరిస్థితులు, పోలీసుల భాష చూస్తే.. జీవితంలో ఎప్పుడూ పోలీసుస్టేషన్‌లో అడుగుపెట్టకూడదు అని చాలా మంది అనుకుంటుంటారు. వెళ్లిన వారు అక్కడి మనుషులు, చుట్టుపక్కల వాతావరణం చూసి సగం జడుసుకుంటారు. కానీ, కేరళలోని ఓ పోలీసుస్టేషన్‌ మాత్రం ఇందుకు భిన్నం. ఐదు నక్షత్రాల హోటల్‌ను తలపిస్తున్న ఈ ఠాణా.. కాసరగోడ్‌ జిల్లాలోని బేకాల్‌ కేంద్రంలో ఉంది. ముఖ్యంగా ఇంటీరియర్‌ డిజైన్‌, రిసెప్షన్‌, సెల్, చూట్టుూ పూల మొక్కలు, లోపలికి అడుగు పెట్టగానే అక్వేరియం, సేద తీరడానికి కుర్చీలు, సోఫాలు, ఇలా ఒకటేమిటి అన్నీ హైటెక్‌ హంగులతో అందంగా తీర్చిదిద్దారు.

భాదితులు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారి కోసం సౌకర్యవంతమైన లాబీని ఏర్పాటు చేశారు. అంతేకాదు పోలీసు స్టేషన్‌కు అదనపు ఆహార్యాన్ని తీసుకురావడానికి భవనం చుట్టూ ఇంటర్‌లాక్‌ టైల్స్‌ వేశారు. ఫిర్యాదు చేయాడానికి ఎవరైనా వస్తే ఓ క్షణం ఆగి ఎక్కడికి వచ్చామా? అని ఆలోచించుకునేంతలా తీర్చిదిద్దారనడంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వం, స్థానికుల సహకారంతో సుమారు రూ. 10 లక్షలు ఖర్చు చేసి.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు స్థానిక పోలీసులు. కేవలం 21 రోజుల్లోనే దీనికి అన్ని హంగులూ అద్దడంతోపాటు రాత్రి సమయంలో విద్యుత్ కాంతులతో చూపరులను కనువిందు చేస్తోంది. ఇప్పుడు ఫిర్యాదులు చేసేందుకే కాదు.. స్టేషన్ అందాలను చూసేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది.