గుమ్మనూరు పేకాట రచ్చ.. ఇంకా కథ చాలా ఉంది

|

Aug 28, 2020 | 11:34 AM

గుమ్మనూరు అనంతపురం- బళ్లారి జిల్లాలకు సరిహద్దులో ఉంది. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలంలో ఉంది. మంత్రిగారి ఇలాఖా కావడంతో పోలీసులు ఇటు రారనే ధీమాతో నిర్వాహకులు ఐదు నెలలుగా పేకాట కొనసాగిస్తున్నారు...

గుమ్మనూరు పేకాట రచ్చ.. ఇంకా కథ చాలా ఉంది
Poker sites
Follow us on

అదొక పేకాట స్థావరం.. పెద్దపెద్దోళ్లంతా వస్తారు. లక్షలు చేతులు మార్చుకుంటారు. కాపలాగా మందీమార్బలాన్ని పెట్టారు. వచ్చే వాళ్లకు పోయే వాళ్లకు ప్రత్యేక వాహనాలు.. కొత్తవారొస్తే తెలిసిపోయేలా ఏర్పాట్లు. ముందు జాగ్రత్తగా కళ్లలో చల్లేందుకు కారం పొడీ సిద్ధం.. ఇదీ అక్కడ జరుగుతున్న వ్యవహారం. మంత్రి జయరాం స్వగ్రామం గుమ్మనూరులో సాగుతున్న పేకాట స్థావరం వ్యవహారం.

అంతేకాదు దారికో ఇన్ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. కొత్త వ్యక్తి ఆ గ్రామంలోకి వస్తుంటే నిర్వాహకులకు
ఇట్టే తెలిసిపోతుంది. ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు.. ఐదు నెలలుగా పేకాట సాగుతోందట. అయినా స్థానిక పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. చివరకు SEB రంగంలోకి దిగితేగాని వ్యవహారం వెలుగులోకి రాలేదు.

గుమ్మనూరు అనంతపురం- బళ్లారి జిల్లాలకు సరిహద్దులో ఉంది. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలంలో ఉంది. మంత్రిగారి ఇలాఖా కావడంతో పోలీసులు ఇటు రారనే ధీమాతో నిర్వాహకులు ఐదు నెలలుగా పేకాట కొనసాగిస్తున్నారు. జిల్లా వాసులతో పాటు కడప, అనంతపురం జిల్లాలు, కర్ణాటక రాష్ట్రం
బళ్లారి, చిత్రదుర్గ, సిందనూరు, శిరిగుప్ప, రాయచూర్‌ తదితర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ జూదం ఆడేందుకు వస్తున్నారంటే ఏ రేంజ్‌లో నిర్వహిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక్కడ భారీగా అక్రమ మద్యం ఉన్నట్లు సమాచారం రావడంతో SEB పోలీసులు మూడు బృందాలుగా
విడిపోయి దాడులు నిర్వహించారు. 33 మందిని అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరం వద్ద నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. కొత్తవారొస్తే కళ్లలో కారంపొడి చల్లేందుకు కూడా సిద్ధంగా ఉంచుకున్నారు.
ఆ గ్రామానికి వెళ్లే దారులు నాలుగు ఉన్నాయి. ప్రతిదారిలోనూ ఒక ఇన్ఫార్మర్‌ను నియమించుకున్నారు. గ్రామం చుట్టూ ఇంకా 10 మంది దాకా ఏర్పాటు చేసుకున్నారు. వీరివల్లే అసలైన వారు పరారైనట్లు సమాచారం.

పేకాట స్థావరం వద్ద నిర్వాహకుల అనుచరులు ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మఫ్టీలో ఉన్న ఎస్‌ఈబీ పోలీసులు అక్కడికి వెళ్లగానే ఇన్ఫార్మర్లతో పాటు అక్కడ ఉన్న అనుచరులు దాడికి దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. పోలీసుల కళ్లలో కారం పొడి చల్లారు. ఏకంగా ఓ సీఐపై దాడి చేసి గాయపర్చారు.

దీంతో ఎస్‌ఈబీ పోలీసులు చేసేది లేక ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వాహనాల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. 5.34 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 35 కార్లు, 6 ద్విచక్ర వాహనాలు సీజ్‌ చేసినట్టు చెప్పారు అడిషనల్‌ ఎస్పీ గౌతమి.

పేకాట ఆడేందుకు వచ్చిన వారి నుంచి టోకన్‌ సిస్టమ్‌గా 3 వేలు నుంచి 5 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఆడే ప్రతి వ్యక్తి కూడా ఇన్ఫార్మర్లకు సైతం డబ్బులు ఇవ్వాల్సిందే. ప్రతిరోజూ లక్షల్లో పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల స్వాధీనం చేసుకున్న వాహనాలను చూస్తే పెద్ద వ్యక్తులు కూడా జూదమాడేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ పేకాట వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోనన్నారు. తాను, తన సోదరులు ఆలూరులోనే ఉంటామని స్పష్టం చేశారు. గుమ్మనూరు మా స్వగ్రామమే అయినా తన కుటుంబ సభ్యులంతా ఉండేది మాత్రం ఆలూరులో అని తెలిపారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలిగినా తాను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోనని తెలిపారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించవద్దని, చట్టప్రకారం చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారినైనా వదలొద్దని సీఎం జగన్‌ పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు పేకాట రాయుళ్ల ఆటకట్టించారు. తమ విధులకు ఆటంకం కలిగించినవారిలో మంత్రి బంధువులతో సహా ఎంతటివారు ఉన్నాసరే ఉపేక్షించేది లేదని, నిబంధనలమేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ. గుమ్మనూరులో పేకాట క్లబ్‌ నిర్వహించిన మంత్రి సోదరుడు నారాయణతో పాటు ,మంత్రి అనుచరులు శ్రీధర్‌, జగన్‌పై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు.