PM Modi Security Cover: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత ఎంత పటిష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ భద్రత కోసం రోజుకు అయ్యే ఖర్చు అక్షరాలా రూ.1.62 కోట్లు. దేశంలోనే ఎస్పీజీ భద్రత పొందుతున్న ఏకైక వ్యక్తి మన ప్రధాని మోదీ. ఇక ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
దేశంలోని ఎంతమందికి ఎస్పీజీ, సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తున్నారంటూ డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆయన మోదీ పేరును బయటికి ప్రస్తావించకుండా.. దేశంలో ఎస్పీజీ భద్రత పొందుతున్న ఒకే ఒక వ్యక్తి ప్రధానమంత్రి అని వెల్లడించారు. అంతేకాక వివిధ రాష్ట్రాల్లో ఉన్న 56 మంది వీఐపీలకు సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తున్నట్లు తెలిపారు.
3000 మంది ప్రత్యేక కమాండోలను కలిగి ఉన్న భద్రతను ఎస్పీజీ అంటారు. ఇక ఈ ఎస్పీజీ భద్రతకు 2020-21 కేంద్ర బడ్జెట్‌లో సుమారు రూ.592.55 కోట్లు కేటాయించారు. గతంలో గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురికి కూడా ఎస్పీజీ భద్రత ఉండేది. అయితే గతేడాది ఎస్పీజీ చట్టంలో పలు కీలక మార్పులు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోని.. వారికి ఈ భద్రతను ఉపసంహరించారు. కాగా, ప్రధాని మోదీ భద్రతకు గంటకు రూ.6.75 లక్షలు.. అలాగే రోజుకు రూ.1.62 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లెక్క.