Tiger fear in Asifabad district: కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండటంతో అటవీ పరిసర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు ప్రజలు పొలాల వద్దకు, వ్యవసాయ పనులకు పోవద్దని అటవీ అధికారులు చాటింపు వేయిస్తున్నారు. అడవిలో పెద్దపులి తిరుగుతోందని అటువైపు వెళ్లొద్దని అప్రమత్తం చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజలు, ఆదివాసీలు అయోమయంలో పడిపోయారు. క్షణం క్షణం.. భయం భయంగా బతుకుతున్నారు.
ఇప్పటికే జిల్లాలోని దహేగావ్ మండలం దిగుటలో ఒకరిని, పెంచికల్‌పేట మండలం కొండపల్లిలో ఒకరిని పులి పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి ఎక్కడ మాటువేసి ఎవరిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు పంటలు చేతికందే సమయంలో ఇదేం సమస్య అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుసగా దాడులు చేస్తున్న కిల్లర్ క్యాట్ వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే పులి అందరిపై దాడి చేస్తుందా లేకుంటే రకరకాల పులులు తిరుగుతున్నాయా తెలియడం లేదంటున్నారు అటవీ అధికారులు. దీంతో పులి సంచారంపై గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసేందుకు గ్రామ కమిటీలను వేస్తున్నారు. పులి సంచారంతో పాటు దాని అడుగులను కనుగొని తమకు సమాచారం చేరవేయాలని కోరుతున్నారు. గతంలో ఉన్న వనసంరక్షణ సమితుల సాయం కూడా తీసుకుంటున్నారు. తొందరగా పులిని పట్టుకొని తమకు స్వేచ్ఛను కల్పించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు.