ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పోరాడే ఏకైక పార్టీ జనసేన ఒక్కటే అన్నారు ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్. విజయవాడ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పుడే కొత్త ప్రభుత్వం ఏర్పడినందువల్ల ఇంకావేచి చూడాల్సిన అవసరముందన్నారు పవన్. అలాగే ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం అలసత్వం చేస్తే పోరాడేందుకు జనసేన ఎప్పుడూ సిద్ధం ఉంటుందన్నారు.
ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ఆస్తుల్ని తెలంగాణకు ఏ బేస్ మీద ఇచ్చారో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్. అక్రమ కట్టడాల కూల్చివేతలపై పవన్ మాట్లాడుతూ అలాంటి వాటిని కూల్చివేయడం మంచిదేనన్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన అలాంటి కట్టడాలన్నిటినీ కూల్చాలని లేకపోతే వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించాల్సి వస్తుందన్నారు. మరోవైపు కేంద్రం కోరుకుంటున్న జమిలి ఎన్నికలకు తాము సిద్ధమేనన్నారు పవన్.
గ్రామస్ధాయినుంచి రాష్ట్రస్ధాయి వరకు పార్టీని పటిష్టంగా నిర్మించడానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు పవన్. వీటిలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ, పార్టీ కో ఆర్డినేషన్ కమిటీ, లోకల్ బాడీ కమిటీల వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా ఎన్నికల తర్వాత కూడా పార్టీ కోసం బలంగా ఎవరు నిలబడ్డారనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.