Moda Kondamma Jatara :కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి..అక్కా చెల్లెళ్లతో నైవేధ్యం ఆరగిస్తుండగా చూసిన భక్తుడు!

|

May 14, 2022 | 8:51 PM

ఏ కోరిక కోరినా వెంటనే నెరవేరుతుందని భక్తుల అపార విశ్వాసం. నమ్మకం..! ప్రతీ ఆదివారం, మంగళవారం నాడు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. మూడు రోజులపాటు జరిగే మహా జాతరకు ప్రభుత్వం నుండి..

Moda Kondamma Jatara :కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి..అక్కా చెల్లెళ్లతో నైవేధ్యం ఆరగిస్తుండగా చూసిన భక్తుడు!
Moda Kondamma Jatara
Follow us on

మన్యం దేవత.. గిరిజనుల కల్పవల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం… ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం.. పాడేరు మోదకొండమ్మ తల్లి. అమ్మవారి మూడురోజుల ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రెండవ గిరిజన జాతరగా పాడేరు మోదకొండమ్మ జాతర పేరొందింది. రాష్ట్ర విభజన అనంతరం మోదకొండమ్మ జాతర ఏపీలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి గిరిజన జాతరగా గుర్తింపు పొందింది పాడేరు మొదకొందమ్మ ఉత్సవం..! మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకోసం భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఏపీలో జరిగే గిరిజనుల పెద్దపండుగ ఇదే కావడంతో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

ఏ కోరికలు కోరుకున్న వెంటనే నెరవేరుతుందని భక్తుల అపార విశ్వాసం. నమ్మకం..! ప్రతీ ఆదివారం, మంగళవారం నాడు భక్తులు పెద్దశాంఖ్యలో వచ్చి ఇక్కడి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. విశాఖ ఏజెన్సీలో పుట్టిన పిల్లలకు అమ్మవారి పేరు పెడతారు. అదే వ్యాపార రీత్యా కూడా అమ్మవారి పేరు పెట్టుకుంటారు. అమ్మవారిపై అంతటి నమ్మకం ఇక్కడ ప్రజలకు. ఇకపోతే, కోవిడ్ కారణంగా రెండేళ్లు జాతర రద్దుచేశారు. ఉత్సవాలకు భక్తులు దూరమాయ్యారు. పరిస్థితులు చక్కబడ్డాక రెండేళ్ల తరువాత అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అల్లూరి జిల్లా ఏర్పడిన తరువాత తొలి పండుగ ఇదే కావడం విశేషం.

ఈనెల 15 నుంచి మూడురోజులపాటు అమ్మవారి జాతర నిర్వహిస్తున్నారు. తొలిరోజు ఆదివారం అమ్మవారి ఆలయం మెట్టినిల్లు నుండి బయలుదేరుతారు. పాడేరు ఆలయం నుంచి శతకం పట్టు పుట్టింటికి డప్పుల వాయిద్యాలతో అమ్మవారి విగ్రహం తీసుకెళ్తారు. పాదాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి శతకం పట్టు వద్ద ప్రతిష్టిస్తారు. మూడు రోజుల పాటు శతకం పట్టు వద్ద అమ్మవారికి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఆ తరువాత విగ్రహాలను తీసుకొచ్చి గుడికి చేరుస్తారు. అక్కడితో జాతర ముగుస్తుంది.. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒడిశా ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం నుండి గిరిజనులు, భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

రాష్ట్రంలోనే అతిపెద్ద పేరొందిన గిరిజన జాతర మొదకొండమ్మ జాతర. రాష్ట్ర ప్రభుత్వం 2014లో రాష్ట్ర జాతరగా గుర్తించి కోటి రూపాయల నిధులు విడుదల చేస్తుంది. ఉత్సవాల్లో గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలు, భోజన, మంచినీటి వసతులు భక్తులకు కల్పిస్తారు. సాంప్రదాయ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. జాతరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 9వందల మందిని ఉత్సవాల కోసం రంగంలోకి దింపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు హిట్ లిస్ట్ లో ఉన్న వారిని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గత అనుభవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కొత్త జిల్లాగా ఏర్పడిన తరువాత అల్లూరి జిల్లాలో పెద్ద పండుగ కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అల్లూరి జిల్లా పాడేరులో వెలసిన మొదకొందమ్మా అమ్మవారికి విశేష చరిత్ర ఉంది. మోదం అంటే సంతోషం.. గిరుల్లో వెలసిన దేవతకు కొండమ్మ. మోద కొండమ్మ అని పేరు వచ్చింది. పూర్వం పాడేరు మండలం మోదాపల్లి అనే గ్రామంలో అడవిలో ఓ రాయి కింద అమ్మవారు పూజలు అందుకునే వారట. కికారణ్యంలో ఉన్న అమ్మవారిని గిరిజనులు ఆరాధించేవారు. పూజలు చేసేవారు. ఆ తల్లే తమను రక్షిస్తుందని గిరిజనులు విశ్వశించి ఆరాధించేవారు. నైవేద్యం సమర్పించేవారు. అయితే.. ఓరోజు అమ్మవారు కోలువుదిరిన ప్రాంతంలో పూజలు చేసి వెళ్తూ ఓ గిరిజనుడు తనతో తెచ్చుకున్న చెంబును మర్చిపోయాడట. దారి మధ్యలో గుర్తుకురావడంతో ఆ చెంబు కోసమని అమ్మవారు కొలువైన రాతిగుహ దగ్గరికి వెళ్లాడు. ఆ సమయంలో అమ్మవారు తన ఏడుగురు చెల్లెల్లు, సోదరుడు పోతురాజుతో కలిసి అమ్మవారికి భక్తులు సమర్పించిన నైవేద్యాలు భుజిస్తున్నారట..! అదే సమయం లో ఆ వ్యక్తి రావడంతో ఆగ్రహించిన అమ్మవారు ఆ చెంబును కాలితో తన్నారు. అది ఎక్కడైతే పడుతుందో అక్కడే పూజలు నిర్వహించాలని అమ్మవారు అన్నారు. అప్పటి నుంచి ఆ చెంబు పడిన ప్రాంతంలో పూజలు చేసేవారు. అయితే.. ఘాట్‌రోడ్డు నిర్మాణం లో భాగంగా పాడేరు నుండి వైజాగ్ వచ్చే దారిలో అమ్మవారి పాదాలు ప్రత్యక్షం కావడంతో అప్పటినుండి అక్కడే పూజలు, జాతర నిర్వహించేవారు. పాడేరుకి పది కిలోమీటర్ల దూరం ఉండడంతో భక్తులు కాస్త ఇబ్బంది పడేవారు. అప్పటి తహసీల్దార్‌ దాసరి శర్మ గారి కలలో అమ్మవారు కనిపించి ఆలయం నిర్మించాలని కోరారు.. దాంతో 1983 నుండి ఆలయ నిర్మాణం మొదలుపెట్టారు. 1985 మే 12 తేదీన ఆలయం పూర్తయింది. అప్పటినుండి పాడేరులో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు.