మహానది గర్భంలో మర్మం.. ఒక వలలో చిక్కిన విగ్రహంతో బయటపడ్డ నిజం!
మహానది నదిలో పిల్లల వలలో చిక్కిన దుర్గాదేవి విగ్రహంతో పెద్ద మర్మం బయటపడింది. 90కి పైగా నాగ విగ్రహాలు, పలు దేవతల విగ్రహాలు బండిల్స్‌గా కట్టేసి నీటిలో ముంచివేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కథనం లోపల పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..

నదులు ఎన్నో కథలు దాచుకుంటాయి.. కానీ కొన్ని కథలు ఒకరోజు బయటపడతాయి. ఒడిశాలోని మహానది దగ్గర అలాంటి ఘటనే ఇప్పుడు చర్చనీయాంశమైంది. గత శనివారం సాయంత్రం.. సన్‌ముండాలి గ్రామానికి చెందిన కొంతమంది పిల్లలు సాధారణంగా చేపల వేటకు నదికి వెళ్లారు. కానీ ఆ రోజు వారి వలలో చేపలు కాకుండా.. ఒక దేవి విగ్రహం చిక్కింది. అది దుర్గా మాత విగ్రహం. అది చూసిన పిల్లలు ఆశ్చర్యపోయారు. వెంటనే గ్రామస్థుడు మనాస్ బెహెరాకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత కలిసి నదిలో మరింతగా వెతకగా.. ఒక్కటి కాదు, రెండూ కాదు.. 90కి పైగా లోహంతో తయారు చేసిన నాగ విగ్రహాలు, అలాగే శివుడు, గణేశుడు, సరస్వతి విగ్రహాలు బయటపడ్డాయి. మూడు శంఖాలు కూడా అదే విధంగా బండిల్స్‌గా కట్టేసి నీటిలో ముంచివేసినట్టు గుర్తించారు.
ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఎవరు ఇలా విగ్రహాలను కట్టేసి నదిలో పడేశారు? ఇది ఏదైనా ప్రత్యేక పూజలో భాగమా? అవి ఎక్కడి నుంచైనా కొట్టుకువచ్చాయా..? లేక మరేదైనా రహస్య కారణమా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. గ్రామస్థులు ఈ విగ్రహాలను తీసుకుని స్థానిక జగన్నాథ ఆలయంలో ఉంచారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. నదిలో ఇలా పెద్ద ఎత్తున విగ్రహాలు బయటపడటం స్థానికంగా మాత్రమే కాదు.. సామాన్యుల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఘటన వెనుక అసలు కథ ఏమిటో తెలుసుకోవాలంటే పోలీసుల దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.
అసలు ఎవరీ మంగ్లీ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..?
