సిలిండర్ ‘డెలివరీ’ మాయాజాలం.. లక్షల్లో వసూళ్లు
నల్గొండ జిల్లాలో గ్యాస్ సిలిండర్ డెలివరీపై రూ. 20-50 అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం 5 కి.మీ. లోపు డెలివరీ ఉచితం కాగా, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నెలవారీగా రూ. 80 లక్షల వరకు వినియోగదారులు నష్టపోతున్నారు. డెలివరీ బాయ్‌లు దురుసుగా ప్రవర్తిస్తూ, అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడికి గుదిబండగా మారితే, డెలివరీ బాయ్స్ వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలు ‘గోరుచుట్టుపై రోకలిపోటు’లా తయారయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిల్లుపై ఉన్న ధర కంటే అదనంగా రూ. 20 నుంచి రూ. 50 వరకు వసూలు చేయడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. పౌరసరఫరాల శాఖ నిబంధనల ప్రకారం, గ్యాస్ ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల లోపు డెలివరీ పూర్తిగా ఉచితం. 5 నుండి 30 కిలోమీటర్ల లోపు ఉంటే కేవలం రూ. 10 మాత్రమే రవాణా ఛార్జీగా వసూలు చేయాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కిలోమీటరు దూరంలో ఉన్న చైతన్యపురి వంటి కాలనీల్లో కూడా అదనంగా రూ. 25 వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.50 కి తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. ఓ వైపు బిల్లులపై ఉన్న ధరకు అదనంగా చెల్లించవద్దని ఏజెన్సీల ప్రతినిధులు చెబుతున్నా..సిలిండర్ ఇంటికి తీసుకొచ్చే సిబ్బంది రూ.20 నుంచి రూ. 50 వరకూ ప్రాంతాన్ని బట్టి వసూలు చేస్తున్నారంటే.. దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10.56 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నెలకు కనీసం 4 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయని భావించినా, సగటున ఒక్కో బండపై రూ. 20 అదనంగా వసూలు చేస్తే.. నెలకు ఏకంగా రూ. 80 లక్షలు వినియోగదారుల జేబుల నుండి తరలిపోతున్నాయి. అయితే ఈ మొత్తం గ్యాస్ ఏజెన్సీలకు చేరుతోందా? లేక డెలివరీ బాయ్‌ల జేబుల్లోకి వెళ్తున్నాయో తేలాల్సి ఉంది. కంపెనీలు ఇచ్చే రవాణా ఛార్జీలను ఏజెన్సీలే వాడుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు కంపెనీలు జీతాలు ఇవ్వడం లేదని, వినియోగదారుల నుంచే వసూలు చేసుకోమంటున్నారని కొందరు డెలివరీ బాయ్స్ బాహాటంగానే చెబుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వినియోగదారులపై సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం, ఇంటికి తాళం వేసి ఉంది అనే సాకు చూపించి సిలిండర్ వెనక్కి తీసుకెళ్లడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైతుల ఐడియాకు బెంబేలెత్తిపోయిన దొంగలు
గోళీలే ఆయుధాలు.. షాపింగ్ మాల్సే వారి టార్గెట్
కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల ‘విజయ’ కేతనం
తండ్రి సెక్యూరిటీ గార్డు.. కొడుకు అమెరికాకు.. క్షణికావేశంలో..
వాహనదారులపట్ల ట్రాఫిక్ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం
రైతుల ఐడియాకు బెంబేలెత్తిపోయిన దొంగలు
కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల విజయ కేతనం
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట

