
Online Classes In Telangana: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆలస్యమైన విద్యా సంవత్సరాన్ని ఆరంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం అయింది. ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. ప్రవేశ పరీక్షలు, పరీక్షలు, విద్యా సంవత్సరంపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు.
ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. సెప్టెంబర్ 1 నుంచి 3-5 తరగతులకు డిజిటల్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఆగష్టు 17వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ క్లాసులు ఉంటాయని.. అలాగే సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇక ప్రైవేట్ స్కూళ్లకు పలు నిబంధనలు, టైం లిమిట్ ఉంటాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అటు 50 శాతం టీచర్లు ఈ నెల 17 నుంచి పాఠశాలలకు హాజరు కావాలన్నారు. కాగా, ఆగష్టు 20 నుంచి దోస్త్ డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమవుతాయన్నారు.